మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి అయితే తప్ప తాము అసెంబ్లీకి రామన్న వైసీపీ నేతలు పంతం వీడతారా? త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారా? లేక మా పంతం మాదేనని గతంలో లాగానే సమావేశాలను బహిష్కరిస్తామని చెబుతారా ? వైసీపీ మళ్ళీ అసెంబ్లీకి డుమ్మా కొట్టబోతోందా? ప్రజల కోసం బెట్టుదిగతారా? జగన్ ఏం ఆలోచిస్తున్నారు? ఈసారైనా అసెంబ్లీకి వెళ్లాలనుకునే ఎమ్మెల్యేలు ఉన్నారా? ప్రభుత్వంలో ప్రతిపక్షం అన్నది కీలకపాత్ర పోషించాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల పక్షాన పోరాడాలి. అప్పుడే రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఏపీలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతుంది.
ప్రభుత్వం మీద అలిగిన ప్రతిపక్షం ప్రజల తరపున చట్టసభలో పోరాటం ఆపేసింది. కారణం ఏదైనా సరే ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కరిస్తారని ఎమ్మెల్యేని ఎన్నుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి గైర్హాజర్ అవుతుండడంపై ప్రజలలో అసంతృప్తి ఎక్కువవుతుంది. మరోపక్క ప్రత్యేకహోదా కోసం కేంద్రంలో పోరాడాల్సిన ఎంపీలు హోదా కోసమే అంటూ రాజీనామాలు చేసి తమతమ పనులలో నిమగ్నమయ్యారు. అక్కడ ఎంపీలు, ఇక్కడ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిదులుగా ప్రజల పక్షాన లేకపోవడంతో పార్టీపై సంకేతాలు మారే అవకాశం ఉంది. ప్రజలలో కూడా ప్రభుత్వం మీద అలక ప్రజల మీద చూపిస్తారా? అనేలా అసంతృప్తి రగులుతుంది.
ఈ విషయం పై స్పీకర్ కోడెల కూడా స్పందించారు. ఈ సారి కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానిస్తానని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అయితే మాట్లాడేందుకు జగన్ తనకు అవకాశం ఇవ్వడంలేదని ఆయన చెప్పారు. ప్రతిపక్షం లేదనే అసంతృప్తి సభాపతిగా తనకు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇరుపక్షాలు ఉంటే సభాపతికి సవాల్‌గా ఉంటుందన్నారు. అటువంటప్పుడు నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కేంద్రం ఓటాన్ అకౌంట్‌కు బదులు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉందని తెలిపారు. అలా చేయడం పూర్తిగా అనైతికం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టదని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు.