ఆయన జగన్ మోహన్ రెడ్డికి అన్నిట్లో A2. ఆ పార్టీకి ట్రబుల్ షూటర్. పార్టీలో ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడంలో దిట్ట అంటూ చెప్పుంటారు. అలాంటి ట్రబుల్ షూటర్ కే ట్రబుల్స్ వస్తే పరిస్థితి ఏంటి...ఎవరికి చెప్పుకోవాలి..ఇంతకీ ఆ ట్రబుల్ షూటర్ ఎవరనుకుంటున్నారా, ఇంకెవరు విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నీ తానై చక్రం తిప్పుతున్న ఆయన ఇంటిపోరును మాత్రం చక్కదిద్దుకోలేకపోతున్నారట. జగన్ ను ఎలాగైనా సీఎం చెయ్యాలని ఆయన దృష్టిసారిస్తుంటే ఆయన కొంపలో మెుదలైన కుంపటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతేగా మరి, ఎదుటి వాడి కొంపలు అంటిద్దామానుకుంటే, అది మన కొంపకే అంటుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావ రామకోటా రెడ్డి ఇటీవల వైసీపీలో చేర్పించాడు విజయసాయి రెడ్డి. అయితే, విజయసాయి రెడ్డికి షాక్ ఇస్తూ, తాజాగా కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి టీడీపీలో చేర్చేందుకు, కడప ఇంచార్జ్ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పావులు కదిపారు. నువ్వు నా బావని తీసుకువెళ్తే, నేను నీ బావమరిది తీసుకు వస్తున్నా అంటూ సోమిరెడ్డి, విజయసాయి నోరు ముపించారు. గత కొంతకాలంగా పార్టీలో సీనియర్ల వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అమర్ నాథ్ రెడ్డి, టీడీపీ ముఖ్యనేతలు ఆయనతో రాయబారం నడిపారు.
ద్వారకనాథ్ రెడ్డి టీడీపీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఆయనతో చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ రోజు ఉదయమే ద్వారకనాథ్ రెడ్డి అమరావతికి చేరుకున్నట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు మండలాల్లో ద్వారకనాథ్ రెడ్డికి మంచి పట్టుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ పై ఎలాంటి హామీ రాకపోవడం, విజయసాయి రెడ్డి అసలు పట్టించుకోకుండా ఉండటంతో, ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.