తిరుమలలో బాలుడి అపహరణ కేసు సుఖాంతమైంది. ఈ కేసులో నిందితుడిని తిరుపతి అర్బన్‌ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అన్బురాజన్‌ మీడియాకు వెల్లడించారు. ‘కిడ్నాపర్‌ విశ్వంభర్‌ నిజామాబాద్‌ వాసి.. కూలీ పని చేస్తున్నాడు. గతంలో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. బాలుడిని పెంచుకోవాలన్న ఉద్దేశంతోనే అతను కిడ్నాప్‌ చేశాడు. డిసెంబర్‌ 22న తిరుమల వచ్చి చిన్నారులను కిడ్నాప్‌ చేయాలనే ఉద్దేశంతో తిరిగాడు. నిందితుడిపై అనుమానం వచ్చి 26న విజిలెన్స్‌ సిబ్బంది విచారించారు. అయితే ఈ విచారణలో నిందితుడు తప్పుడు సమాచారం ఇచ్చాడు’ అని ఎస్పీ తెలిపారు.

tirupati 01012019 2

నిందితున్ని పట్టుకునేందుకు 6 ప్రత్యేకబృందాలు ఏర్పాటు చేశామని.. తితిదే, విజిలెన్స్‌, రైల్వే పోలీసులు సమష్టిగా కృషి చేశారని కొనియాడారు. డిసెంబర్‌ 28న ఉదయం తిరుమలలో 16 నెలల బాలుడు వీరేశ్‌ను విశ్వంభర్‌ కిడ్నాప్‌ చేశాడు. అనంతరం బాలునితో మహారాష్ట్రలోని మాహూరుకు నిందితుడు వెళ్లాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడు వెళ్లిన మార్గాన్ని పోలీసులు గుర్తించారు. బాలుని ఆచూకీ కనుగొనడంలో తిరుపతి అర్బన్‌ పోలీసులు, మహారాష్ట్ర పోలీసులు సమష్టిగా కృషి చేశారని ఎస్పీ తెలిపారు. అక్కడి స్థానికులు గుర్తుపట్టి సమాచారం ఇవ్వడంతో మాహూరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. మీడియాలో విస్తృత ప్రచారంతో ఆచూకీ త్వరగా లభించిందన్నారు. ఈ ఘటనతో తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. చిన్నారులతో వచ్చే తల్లిదండ్రులకు ఇకపై చైల్డ్‌ ట్యాగింగ్‌ వేస్తామని తెలిపారు.

tirupati 01012019 3

బాలుడు అదృశ్యమైన నాటి నుంచి పోలీసులు ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలించారు. నిందితుడిని గుర్తించి, అతని ఫోటో తీసి, ప్రచారం చెయ్యటంలో తిరుపతి పోలీసులు సక్సెస్ అయ్యారు. ఈ ఘటనపై పత్రికలు, ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల వేదికగా కూడా పెద్దఎత్తున ప్రచారం లభించింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా బాలుడిని, నిందితుడిని ఆదివారం ఉదయం మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఇక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడిని, బాలుడిని తిరుపతి పోలీసులు మహారాష్ట్ర వెళ్లి, తిరుపతి తీసుకువచ్చారు. రెండు రోజుల్లోనే కేసును చేదించటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read