ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం (2019 జనవరి 1) చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. విభజన జరిగిన నాలుగున్నరేళ్ల అనంతరం కీలకమైన హైకోర్టు కొలువు తీరుతోంది. తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారురు. విజయవాడలో గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తితోపాటు మిగిలిన న్యాయమూర్తులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లయింది. ఏపీ విభజన నేపథ్యంలో 62ఏళ్ల తర్వాత సోమవారం అమరావతికి హైకోర్టు తరలివెళ్లింది.
దీంతో రాష్ట్రంలో చారిత్రక ఘటం ఆవిష్కృతమైంది. 2018 డిసెంబరు 26న ఉమ్మడిహైకోర్టు విభజన నోటిఫికేషన్ వెలువడింది. దీంతో నేటి నుంచి అమరావతి కేంద్రంగా ఏపీ రాష్ట్ర హైకోర్టు విధులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడిహైకోర్టులో 3.4లక్షల వ్యాజ్యాలు ఉండగా.. అందులో 70శాతం వరకు కేసులు ఏపీకి చెందినవే. ఏపీ హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 37 కాగా... ప్రస్తుతం ఉన్న వారు 14 మంది. క్యాంపు కార్యాలయంలో 9 కోర్టుహాళ్లు సిద్ధం చేశారు. మరో హాలును మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఆర్ అండ్ బీ కార్యాలయంలో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధాన న్యాయమూర్తి సహా న్యాయమూర్తులంతా ప్రమాణ స్వీకారం అనంతరం తాత్కాలిక హైకోర్టుకు చేరుకున్నారు. తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులుకానున్నారు. 2వ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు విధులు నిర్వర్తిస్తారు. 5వ తేదీన సంక్రాంతి సెలవులు మొదలవుతాయి. అప్పటి నుంచి 21వ తేదీ వరకు వెకేషన్ కోర్టును నిర్వహిస్తారు. ఇది వారంలో రెండు రోజులపాటు పనిచేస్తుంది. ఈ నెలాఖరుకు రాజధాని అమరావతి పరిధిలోని జ్యూడీషియల్ కాంప్లెక్స్‌కు హైకోర్టు తరలి వెళుతుంది.
ఉమ్మడి హైకోర్టులో చివరి పని రోజు భావోద్వేగాల మధ్య గడిచింది. కోర్టు విభజనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్‌తో కూడిన ధర్మాసనం ఎదుట తన కేసు వాదనలను ముగిస్తూ సీనియర్ న్యాయవాది డి.వి.సీతారాంమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తప్పనిసరైనప్పటికీ సమయం సరికాదన్నారు. కోర్టు విధులు కొంతసేపు మాత్రమే కొనసాగాయి. అనంతరం న్యాయవాదులు, న్యాయమూర్తుల మధ్య పరస్పర ఆలింగనాల నడుమ వీడ్కోలు పలుకులతో గడిచింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, ఏపీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌లు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. విడిపోయే న్యాయమూర్తులందరూ కలిసి కొబ్బరికాయ కొట్టి వెళ్లారు. తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ వీడ్కోలు ఏర్పాటు చేసింది. హైకోర్టు ఆవరణలో న్యాయవాదులు, న్యాయమూర్తులు ఒకరికొకరు అభినందనలు, వీడ్కోలు పలికారు.