ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక నెటిజన్ అన్న క్యాంటీన్ లో భోజనం చేసి, ట్విట్టర్ లో స్పందిస్తూ, చంద్రబాబు, లోకేశ్ లను ట్యాగ్ చేస్తూ..‘విజయవాడలోని 22వ వార్డులో ఉన్న అన్న క్యాంటీన్ లో మొదటిసారి భోజనం చేశాను. అంత రుచికరమైన భోజనం కేవలం రూ.5కే తిన్నందుకు చాలా గిల్టీ భావన కలిగింది. క్యాంటీన్ సిబ్బందికి రూ.100 డొనేషన్ ఇచ్చేందుకు యత్నించాను. కానీ కుదరలేదు. అన్న క్యాంటీన్లలో డొనేషన్ బాక్సులను పెట్టాల్సిన అవసరం ఉంది’ అని ట్వీట్ చేశారు. ఇందుకు నారా లోకేశ్ స్పందిస్తూ..‘అది మంచి ఆలోచనే. ఈ ప్రతిపాదనను అమలు చేస్తాం. మరోసారి ధన్యవాదాలు’ అంటూ ట్విట్టర్ లో జవాబు ఇచ్చారు.
నాడు ఎన్టీఆర్ కిలో రెండు రూపాయల బియ్యంతో చరిత్ర సృష్టిస్తే నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే పేదలకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. నాణ్యమైన భోజనం ఐదు రూపాయలకే అందజేస్తుండడంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రతి పేదవాని ఆకలి తీర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి గత ఏడాది జూలై 11న అన్న క్యాంటీన్లను శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 73 మున్సిపాల్టీల్లో 203 అన్న క్యాంటీన్‌లను ప్రారంభించారు. మొదటి విడతలో 35 పట్టణాల్లో 100 క్యాంటీన్లు, రెండో విడతలో 75 పట్టణాల్లో 103 క్యాంటీన్లు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 368 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. మరో 200 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని, గ్రామీణ ప్రాంతాలకూ క్యాంటీన్లను విస్తరించాలని సామాన్యుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయంటే ఈ పథకం ఎంత ప్రయోజకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గత ఏడాది డిసెంబర్ నాటికి అన్న క్యాంటీన్లలో 1.60 కోట్ల ప్లేట్ల ఆహారం అందించారు. 43.60 లక్షల మందికి అల్పాహారం, 53.39 లక్షల మంది మధ్యాహ్న భోజనం, 32.74 లక్షల మంది రాత్రి భోజనం చేశారని అధికారిక సమాచారం. ఒక్కో క్యాంటీన్‌లో రోజూ మూడు పుటలా కలిపి 900 మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. రూ. 5 కే ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందిస్తున్నా నాణ్యతలో ఎక్కడా రాజీ పడటం లేదు. మూడు పూటలా తిండి పెట్టేందుకు ప్రభుత్వం ఒక్కొక్కరికి సుమారుగా రూ. 80 ఖర్చు చేస్తున్నది. కేవలం రూ. 15కే మూడు పూటలా నాణ్యమైన భోజనం అందిస్తున్నారు.