పండగ వాతావరణం నడుమ నిన్న నెల్లూరులో జన్మభూమి- మా ఊరు ముగింపు కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీటితో పాటు జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నం దగదర్తి విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. చారిత్రాత్మకంగా సంయుక్త సహకార రైతు సంఘాల(సీజేఎఫ్ఎస్) భూములను రద్దు చేసి.. వాటి స్థానంలో రైతులకు యాజమాన్య హక్కులను కట్టబెడుతూ డీకేటీ పట్టాలను అందించారు. ఇలా విభిన్న కార్యక్రమాల మేళవింపుగా సీఎం చంద్రబాబునాయుడు పర్యటన సాగింది. సీఎం పర్యటనతో బోగోలుగా ఒకింత పండుగ వాతావారణం ముందుగానే వచ్చింది. శుక్రవారం నిర్వహించిన సభలో అంశాలు మొత్తం ప్రభుత్వానికి చారిత్రాత్మకంగా నిలిచిపోనున్నాయి. సీజేఎఫ్ఎస్లను రద్దు చేసి.. వాటి స్థానంలో డీకేటీ పట్టాలు ఇవ్వటం ద్వారా భూములపై యాజమాన్య హక్కులు లబ్ధిదారులకు దక్కనున్నాయి.
ఈ సందర్భంగానే సహకార సంయుక్త రైతు సంఘాల(సీజేఎఫ్ఎస్) భూములకు సంబంధించి ఒకే రోజు రూ.8 వేల కోట్ల విలువైన భూ పట్టాలను పేదలకు సీఎం చంద్రబాబునాయుడు అందించారు. మొత్తం 66,276.79 ఎకరాల భూమికి హక్కులను కట్టబెట్టారు. తొలివిడత కింద 60,596 మంది లబ్ధి పొందారు. వీరిలో ఎస్సీలు, ఎస్టీలు, ఇతరులు, బీసీలు ఉన్నారు. ఈ భూమి విలువ ఎకరా సగటున సుమారు రూ.12 లక్షల చొప్పున... మొత్తం విలువ దాదాపు రూ.8వేల కోట్లు. ఈ స్థాయిలో ఒకేసారి పట్టాలను ఇవ్వటం రాష్ట్రంలో సరికొత్త చరిత్రగా మారింది. భూమి పట్టాతో పాటు చీర, పసుపు, కుంకుమ, గాజులు, టెంకాయ కలిపి పంపిణీ చేశారు. ఈ పట్టాలను మహిళలకు అందిస్తూ సీఎం ఉద్విగ్నతకు గురయ్యారు. ఇంతమంది ఆడపడుచులకు రూ.కోట్ల విలువైన భూమిని కానుకగా ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఆస్తి భద్రత కల్పించామని చెప్పారు. ఎవరికీ ఒక్కపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని, లబ్ధిదారులకు మళ్లీ ఫోన్లు చేసి మాట్లాడతానని స్పష్టం చేశారు
మొదటివిడత నిర్వహించిన జన్మభూమిలో ప్రజల నుంచి 40 లక్షల వినతులు వస్తే... ప్రస్తుతం 4.57 లక్షలు మాత్రమే వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవి గణనీయంగా తగ్గిపోవడమే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని టెలీకాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. శనివారం నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించాలన్నారు. ‘16వేల గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించడం ఒక చరిత్ర. 16వేల గ్రామాభివృద్ధి ప్రణాళికలను అప్లోడ్ చేయడం ఒక రికార్డు. ప్రజల భాగస్వామ్యానికి జన్మభూమి, గ్రామవికాసం, జలసిరికి హారతి కార్యక్రమాలను తీసుకొచ్చాం. స్వశక్తితో ముందుకెళ్తున్నాం. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లోనూ పనిచేస్తాం...’ అని వివరించారు. చంద్రబాబు ప్రసంగం కూడా కొత్తపుంతలు తొక్కింది. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి.. సంక్షేమ పథకాలు.. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన అంశాలను ఇవ్వకుండా కేంద్రం చేసిన మోసాలు.. నాలుగున్నరేళ్ల తెదేపా ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ గురించి విమర్శలు చేశారు. సంపద సృష్టించే పార్టీగా తెదేపా గురించి చెబుతూ.. వైకాపాకు అధికారం అప్పగిస్తే రాష్ట్ర అభివృద్ధి కుక్కలు చింపిన విస్తరిగా మారుతుందని హెచ్చరించారు.