లోక్‌సభలో ఈబీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడాన్ని చంద్రబాబు స్వాగతించారు. తాము ఆ బిల్లుకు మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. అదే సమయంలో కేంద్రం పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని, కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానాలు, బిల్లు లు ఆమోదించి పంపామని గుర్తు చేశారు. కేంద్రం తనకు కావాల్సింది చేసుకుని రాష్ట్రాల సిఫార్సులను విస్మరిస్తోందని విమర్శించారు. ఈబీసీ బిల్లును కేంద్రం ఒక రోజులో తెచ్చిందని, ఒకవేళ వారికి దీనిపై చిత్తశుద్ధి ఉంటే ముందే తీసుకొచ్చి అందరితో సంప్రదించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
బుధవారం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. భాజపా తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు సామాజిక వెనుకబాటుతనం రిజర్వేషన్లే ఉన్నాయని, ఆర్థిక వెనుకబాటుతనం రిజర్వేషన్లు కొత్తగా తెచ్చారని అన్నారు. దేశంలో సంఘ్ పరివార్.. కుట్రల కేంద్రంగా మారిందని, ఆ కుట్రలను అమలు చేసే కేంద్రంగా భాజపా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. రిజర్వేషన్లు మంచికోసమే అయితే తాము తప్పకుండా స్వాగతిస్తామని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు గండి కొడతామంటే ఎదిరిస్తామని హెచ్చరించారు. కుట్ర కోణాలపై అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు.
ఆర్థికంగా పేదలకు రిజర్వేషన్లను స్వాగతించాలని, కాపుల రిజర్వేషన్లపై డిమాండ్ చేయాలన్నారు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చడంపై ప్రశ్నించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. సామాజిక తరగతుల మార్పుపై డిమాండ్ల గురించి ఒత్తిడి చేయాలన్నారు. పార్టీలో గ్రూపు విభేదాలకు స్వస్తి చెప్పాలని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం మూర్ఖత్వమవుతుందని ఆయన అన్నారు. అవినీతిపరులే అవినీతిపై పుస్తకాలు వేస్తున్నారని ఎద్దేవాచేశారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి చక్రవర్తని ఆయన విమర్శించారు. జగన్ వల్ల ఎంతో మంది జైలుకు వెళ్లారని, చాలా మంది అవమానాలకు గురయ్యారని అన్నారు. కేంద్రం ఏపీకి రూ.75 వేల కోట్లు ఇవ్వాలని జయప్రకాశ్ కమిటీ చెబితే జగన్ ఎందుకు నోరు మెదరపరని ప్రశ్నించారు.