రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా జగన్ వౌనం వహించడానికి కారణం సీబీఐ కత్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కర్నూలు జిల్లా కోసిగి గ్రామంలో మంగళవారం జరిగిన జన్మభూమి-మా ఊరు గ్రామ సభలో ఆయన ప్రసంగిస్తూ కేంద్రం చేస్తున్న అన్యాయంపై రాష్ట్రంలో అందరూ ప్రశ్నిస్తున్నారని, అయితే ఒక్క జగన్ మాత్రం మోదీని పల్లెత్తుమాట అనడం లేదన్నారు. పైగా తమ ప్రభుత్వంలో రూ. 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌కు మించి అవినీతి ఎలా జరుగుతుందో జగనే చెప్పాలని చంద్రబాబు అన్నారు. తాను గానీ, తన కుటుంబం గానీ అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమకు ఉన్న పరిశ్రమలతో ఆదాయం సమకూరుతోందని, ప్రజల సొమ్ము కోసం కక్కుర్తిపడాల్సిన అవసరం లేదన్నారు.
ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రజల కళ్ల ముందే, వారి సమక్షంలోనే జరుగుతున్న విషయం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గద్దెనెక్కాలి, ఉన్న కొద్దిపాటి ప్రజల సొమ్మును మింగేయాలన్న లక్ష్యంతో మొన్నటి వరకు కోడి కత్తి డ్రామా ఆడారని మండిపడ్డారు. జగన్‌కు అంత కంటే పెద్ద కత్తి సీబీఐ రూపంలో వెంటాడుతోందన్నారు. మోదీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే తక్షణం జగన్ జైలులో ఉంటారని చంద్రబాబు అన్నారు. సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, రాష్ట్రానికి మోదీ చేస్తున్న అన్యాయంపై జగన్ నోరు మెదపడం లేదన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి సుమారు రూ.85 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో మేధావులు తేల్చి చెప్పారని, ఇందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చంద్రబాబు అన్నారు. వారు అన్ని శాఖల రికార్డులను పరిశీలించి కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిన మాట నిజమేనని తేల్చారని, బకాయిలు చెల్లించకుండా రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారని వారు పేర్కొన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక్క జగన్ మినహా అందరూ కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిలదీస్తున్నారని ఆయన మాత్రం సీబీఐ కేసుల దెబ్బకు భయపడి వౌనంగా పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌పై నమోదైన కేసుల నుంచి కాపాడే శక్తి మోదీకి లేదన్నారు. జగన్ పాల్పడిన అవినీతికి ఏదో ఒక రోజు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.