ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు అంచనాలను వేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడి బీజేపీ నేతలకు మంచి జోష్‌ను అందించారు. తాజాగా రాష్ట్రంలో బీజేపీతో పాటు ఇతర పార్టీల పరిస్థితిపై సర్వే నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు గురించి తెలుసుకుంటున్నారు.
వీటితో పాటు 24 గంటలు విద్యుత్ సరఫరా జరుగుతోందా, తాగునీటి సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, రేషన్ సరఫరాకు సంబంధించిన పలు అంశాలు, ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ పనితీరు బాగుందా.. అని తెలుసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అవినీతి, స్వచ్ఛ్భారత్, దేశ రక్షణ, ఆర్థిక పరిస్థితులు, వౌలిక సదుపాయాల కల్పన, ప్రతీ ఇంటికి విద్యుత్తుతో పాటు పొత్తులపై కూడా అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఒక ఓటరుగా నిరంతర విద్యుత్, పరిశుభ్రత, ఉద్యోగం, విద్య, లా అండ్ ఆర్డర్, ధరలు, అవినీతి, రైతు సంక్షేమం ఇలా ఏది చూసి ఓటు వేస్తారో తెలుసుకుంటున్నారు.
ఇక రానున్న ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ముగ్గురు బీజేపీ నేతల పేర్లను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అదే విధంగా పార్లమెంటు నియోజకవర్గం నుండి రాష్ట్రంలో ముగ్గురు నేతల పేర్లను తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్వే చేపడుతున్నారన్న విషయం తెలుసుకున్న నేతలు తమ వర్గాలకు సమాచారాన్ని అందించి తమ పేర్లను ప్రతిపాదించాలని చెబుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.