రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు లైట్ ఆటో కంపోనెంట్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పం దం కుదుర్చుకుంది. మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా సమక్షంలో ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఈడీబీ) సీఈఒ జాస్తి కృష్ణకిషోర్, సంస్థ ఎండీ బాలానంద్ జాలాది ఒప్పంద అవగాహనా పత్రాలపై సంతకాలు చేశారు. వాహనాల విడిభాగాల తయారీలో రూ. 300 కోట్ల పెట్టుబడికి లైట్ ఆటో సంస్థ ముందుకొచ్చింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అనువైన ప్రాంతాలను గుర్తించి పరిశ్రమ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మొదటి దశలో 100 కోట్లు, రెండో దశలో మరో 200 కోట్లు పెట్టుబడికి సంసిద్ధత వ్యక్తం చేసింది.
దీనివల్ల 250 మందికి ప్రత్యక్షంగా, మరో 350 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అల్యూమినియానికి ప్రత్యామ్నాయంగా మెగ్నీషియంతో వాహనాల విడిభాగాలు తయారు చేయటం వల్ల బరువును నియంత్రించడంతో పాటు ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని సంస్థ సీఈఒ సుభాచరణ్ తెలిపారు. మరో పక్క, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో రూ.150 కోట్ల పెట్టుబడితో ప్రింటింగ్, ప్యాకింగ్ యూనిట్ల ఏర్పాటుకు దేశంలోనే పేరొందిన కళాజ్యోతి ప్రింటింగ్ కంపెనీ ముందుకొచ్చింది.
వీటి ఏర్పాటుతో ప్రత్యక్షంగా 400 మందికి, పరోక్షంగా 800 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఉండవల్లిలో సంస్థ డైరెక్టర్ అలపాటి రామనాథ్, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో జాస్తి కృష్ణ కిశోర్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. 1946లో ఏర్పాటై ఆఫ్‌సెట్ ముద్రణలో ఎంతో ప్రాచుర్యం కలిగిన ఈ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంపై ఈడీబీ సీఈవో కృష్ణకిశోర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.