సంక్రాంతి పండుగకు ముందు నవ్యాంధ్రకు అతి పెద్ద ‘పెట్టుబడి పండుగ’ వచ్చింది. భారత పారిశ్రామిక దిగ్గజం ‘అదానీ’ ఏపీలో దేశంలోనే అతిపెద్దదైన ‘డేటా సెంటర్’ ఏర్పాటు చేయనుంది. విశాఖ సమీపంలో 500ల ఎకరాల్లో... ఏకంగా 70వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. బుధవారం సీఎం చంద్రబాబు సమక్షంలో అదానీ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీతో ఐటీ శాఖ లోకేశ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత కుదిరిన అత్యధిక పెట్టుబడి ఒప్పందం ఇదే. దీని ప్రకారం... అదానీ సంస్థ దేశంలోనే ఎక్కడా లేనంతస్థాయిలో 5జీడబ్ల్యూ సామర్థ్యంతో విశాఖలో డేటా సెంటర్ పార్కులను ఏర్పాటు చేస్తుంది.
ఈ పార్కుల్లో 20 ఏళ్ల కాలంలో రూ.70వేల కోట్లను పెట్టుబడిగా పెడుతుంది. డేటా సెంటర్ ద్వారా రూ.40వేల కోట్లు, సోలార్ పార్కుల ద్వారా రూ.30వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఫలితంగా 1.10లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...ఈ ప్రాజెక్టు తొలిదశ 18నెలల్లో పూర్తవుతుందన్నారు. భవిష్యత్తులో డేటా ద్వారానే సంపద సృష్టి జరుగుతుందన్నారు. వినూత్న ఆవిష్కరణలు, భావి ఫలితాలు ప్రతిదీ సమాచారంపైనే ఆధారపడి ఉంటాయని, ఐటీకి డేటా సెంటర్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి చేశామని, ఇప్పుడు ఏపీని డేటా హబ్‌గా మారుస్తున్నామన్నారు.
ప్రపంచంలోనే తొలిసారిగా... వందశాతం పునరుత్పాదక ఇంధనంతో నడిచే డేటా సెంటర్ పార్కులు ప్రపంచంలోనే తొలిసారిగా విశాఖలో ఏర్పడబోతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. వీటిద్వారా ఉద్యోగాల కల్పన, టెక్నాలజీ స్టార్ట్‌పలు రాష్ట్రానికి తరలొస్తాయన్నారు. రాబోయే ఐదేళ్లలో డేటా వినియోగం వందశాతం పెరుగుతుందని, సమాచార నిల్వ కీలకంగా మారుతుందన్నారు. సమాచార వినియోగం జపాన్‌లో 8.3జీబీ ఉంటే ఇండియాలో 8.8జీబీ ఉందన్నారు. భారత్‌లో ఉన్నంతమంది 4జీ వినియోగదారులు మరెక్కడా లేరని, జపాన్‌లో వీరు 6.5శాతం మంది కాగా, ఏపీలో 18శాతం అని వివరించారు. భవిష్యత్తులో వర్జీనియాకు దీటుగా విశాఖ రూపొందుతుందన్నారు. ఈ ఒప్పందం ద్వారా డేటా అనలిటిక్స్, మిషన్ లెర్నింగ్, ఏఐకు బాటలు పడతాయన్నారు. ఎంత త్వరితగతిన డేటా సెంటర్లను అభివృద్థి చేస్తారోనన్న ఆసక్తి తనకు కూడా ఉందన్నారు. ఏపీని ఎంపిక చేసుకున్న గౌతమ్ అదానీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భావనపాడు ఓడరేవు ద్వారా శ్రీకాకుళం అభివృద్ధి చెందుతుందని, ఇకపై ఉత్తరాంధ్ర వలసలకు ఈ పోర్టు అడ్డుకట్టగా ఉంటుందన్నారు.