చిత్తూరు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరులో జన్మించిన మహిళ నౌహీరా షేక్‌! జిల్లాలు, రాష్ట్రాలు దాటి పలు దేశాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. వేలకోట్ల మోసాలకు పాల్పడ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను సైతం షేక్‌ చేస్తోన్న హీరా గ్రూప్‌ సంస్థల అధినేతకు బీజేపీ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఏర్పాటు చేసే కార్యక్రమాలకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ముఖ్య అతిథిగా హాజరవడం, బుల్లెట్‌ రైలు శంకుస్థాపన సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మోదీ ఫొటోతో నౌహీరా షేక్‌ భారీగా పత్రికా ప్రకటనలు ఇవ్వడం, హోర్డింగులు ఏర్పాటు చేయడం, సంస్థ వెబ్‌సైట్‌లో బీజేపీ నేతలకు సంబంధించిన కార్యక్రమాలు ఉండటంపై ఏపీ పోలీసులు ఆరా తీస్తోంటే కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. గొలుసుకట్టు పథకం పేరుతో వందల కోట్లు మోసం చేశారంటూ తెలుగు రాష్ట్రాల్లో నౌహీరా షేక్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. విదేశీ మారక ద్రవ్య నిబంధనలను కూడా ఆమె ఉల్లంఘించినట్లు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసుల విచారణలో తేలింది. హీరాగోల్డ్‌, హీరా ఫుడెక్స్‌, హీరా టెక్స్‌టైల్స్‌.. ఇలా తన గ్రూపు సంస్థల్లోకి వందల కోట్ల విలువైన డాలర్లు, రియాళ్లు, దినార్లను మళ్లించడం ఎలా సాధ్యమైందనే విషయం చర్చనీయాంశమైంది.

చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం కల్లూరులో నిరుపేద కుటుంబంలో నౌహీరా జన్మించారు. పీలేరు సమీపంలోని వాల్మీకిపురంలో ఒక మండి కూలీని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు, ముంబైకి మకాం మార్చారు. అక్కడి ధనవంతుల పిల్లలకు విద్య బోధించేవారు. ఆ తర్వాత తిరుపతికి వచ్చి మదర్సా ఏర్పాటు చేసి విదేశీ నిధులు సేకరించడం మొదలు పెట్టారు. ఆపై చైన్‌లింక్‌ వ్యాపారంతో మధ్య తరగతిని టార్గెట్‌ చేసి భారీగా డిపాజిట్లు సేకరించారు. ఆఫ్రికా వెళ్లి బంగారం ట్రేడింగ్‌ మొదలుపెట్టి.. లక్ష రూపాయలకు నెలకు రూ.2700 నుంచి రూ.3500 అకౌంట్లలో డిపాజిట్‌ చేయడంతో బడా బాబులు సైతం ఆకర్షితులయ్యారు. కొందరు ఏకంగా రూ.2కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. అమెరికా నుంచి రూ.45 కోట్లు సేకరించిన హీరా... యూఏఈ నుంచి ఏకంగా రూ.2300 కోట్లు సేకరించినట్లు కంపెనీ కంప్యూటర్ల హార్డ్‌ డిస్క్‌ల పరిశీలనలో తేలినట్లు సమాచారం.

 

ఏడాదిన్నర క్రితం షార్జాలో టీ20 క్రికెట్‌ లీగ్‌ నిర్వహించిన నౌహీరా రాజ్యాధికారం వైపు మొ గ్గు చూపారు. ‘మహిళా సాధికార పార్టీ’ పేరుతో తానే ఒక రాజకీయ పార్టీ స్థాపించారు. కర్ణాటక ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో నిలిపారు. ‘మాది ఆషామాషీ పోటీ కాదు’ అనేలా భారీ స్థాయిలో ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా మైనారిటీల ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. కాంగ్రె్‌సకు పడాల్సిన మైనారిటీల ఓట్లను చీల్చి, బీజేపీ గెలుపునకు సహకరించేందుకే నౌహీరా షేక్‌ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. తమకు బీజేపీతో సంబంధం లేదని ఆమె చెబుతున్నా.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వెబ్‌సైట్‌లలో మాత్రం బీజేపీ నేతల ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఇది నౌహీరాతో కమల నాథులతో సఖ్యతను తెలియజేస్తున్నాయని ప్రస్తుత ఆమె కేసుల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు అనుమానిస్తున్నారు. 2015 నుంచే హీరాగ్రూప్‌ ఆర్థిక కార్యకలాపాలపై రిజర్వ్‌ బ్యాంకు కన్నేసింది. భారీ ఎత్తున వినియోగదారుల నుంచి డిపాజిట్లు వసూలు చేస్తోందన్న ఫిర్యాదుల నేపధ్యంలో ఆ సంస్థ కార్యకలాపాలు, వాణిజ్య లావాదేవీలపై ఆర్‌బీఐ దృష్టిపెట్టింది. వాస్తవాల నిర్ధారణకు ఈ అంశాన్ని సమన్వయ కమిటీలో చర్చకు పెట్టింది. 2016లో మరిన్ని ఫిర్యాదులు పెరగడంతో ఈడీతో విచారణ చేయించారు. ఆరోపణల్లో వాస్తవం ఉందని తేలడంతో హీరాగ్రూప్‌ వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని 2016లోనే ఆర్‌బీఐ పోలీసు శాఖను కోరింది. అప్పట్లో అనేక ఒత్తిళ్లతో అది ముందుకు సాగేలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read