ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, 14 మంది టీడీపీ ఎంపీలను సభ నుంచి నిన్న స్పీకర్ సుమిత్రా మహాజన్ నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేశారు. దీంతో, ఈరోజు వారంతా పార్లమెంటు ప్రాంగణంలో ప్లకార్డులు పట్టుకుని, ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారి వద్దకు సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ వచ్చారు. ఎంపీల ఆందోళనకు తన మద్దతు ప్రకటించారు. వారితో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరో పక్క హక్కుల కోసం పోరాడుతున్న ఎంపీలను సస్పెండ్ చెయ్యటం పై, చంద్రబాబు స్పందించారు. పార్లమెంటు వైపే రాష్ట్రం మొత్తం చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం ఎంపీల పోరాటాన్ని 5 కోట్ల ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. పార్టీ ఎంపీలతో ఆయన ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దిల్లీలో లాఠీఛార్జితో పాటు ఎంపీల సస్పెన్షన్ ప్రతి ఒక్కరూ ఖండించాలని సీఎం అన్నారు. గురువారం 14 మంది తెదేపా ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని తప్పుపట్టిన చంద్రబాబు రెండు రోజుల్లో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఏంటని నిలదీశారు.
భాజసా నేతలకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని దుయ్యబట్టారు. దేశం మొత్తం భాజపాకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. దిల్లీలో లాఠీఛార్జి బాధితులను ముఖ్యమంత్రి ఫోన్లో పరామర్శించారు. గాయపడిన వెంకట్‌కు ఫోన్ చేసి చర్యను ఖండించారు. కేంద్రం నిరంకుశ పోకడలకు వెళ్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హోదా సాధన సమితి ప్రతినిధులపై దిల్లీ పోలీసుల దాడి గర్హనీయమన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై లాఠీఛార్జి అమానుషమని, కేంద్రం నిరంకుశ పోకడలకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని ఆక్షేపించారు. భాజపాతో కుమ్మక్కైన పార్టీలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.