వరుస నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్న ఏపి ప్రభుత్వం, వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెలాఖరులోగా మరో 14 నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ పీ ఉదయ భాస్కర్ వెల్లడించారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 14 నోటిఫికేషన్ల ద్వారా 1521 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. సర్వీస్ నిబంధనలు, అర్హతలు, ఖాళీల వివరాలు, తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి వివరాలు రావాల్సి ఉందన్నారు. ఈ వివరాలు అందిన వెంటనే నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. ఈ ఏడాది ఇప్పటికే 21 నోటిఫికేషన్లు జారీ చేశామని గుర్తు చేశారు. దీని ద్వారా 3255 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఏఈఈ పోస్టులకు 47001 మంది, ఫారెస్టు రేంజర్ ఆఫీసర్ల పోస్టులకు 16,130 మంది, హార్టికల్చర్ అధికారుల పోస్టులకు 1307 మంది, పంచాయతీరాజ్ సెక్రటరీ పోస్టులకు 56,621 మంది దరఖాస్తు చేశారన్నారు. వివిధ పరీక్షలకు తుది గడువు వరకూ వేచి ఉండకుండా నోటిఫికేషన్ వెలువడిన వెంటనే దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు.
చివరి తేదీల్లో దరఖాస్తు చేయడం వల్ల సర్వర్‌పై ఒత్తిడి పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అభ్యర్థులు దీనిని గమనించాలన్నారు. ఓటీపీఆర్‌లో తలెత్తే ఇబ్బందుల పరిష్కారానికి ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను, ఇతర సమస్య పరిష్కారానికి మరో రెండు హెల్ప్లైన్లు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు తమ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్లు మార్చడం వల్ల ఓటీపీఆర్ పంపడం, సవరణలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. 2016లో 34 నోటిఫికేషన్లను విడుదల చేసి, విజయవంతంగా ఎటువంటి కోర్టు వివాదాలు లేకుండా నియామకాలు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం స్క్రీనింగ్ పరీక్షకు కటాఫ్ మార్కులు నిర్ణయించి, 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్‌కు ఎంపిక చేస్తున్నామన్నారు. వివిధ కేటగిరిల్లో తగిన సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కాని పక్షంలో కటాఫ్ మార్కులను సడలించి, కొంతమందిని మెయిన్‌కు అనుమతిస్తున్నామన్నారు.
అయితే వీరు క్యారీఫార్వర్డ్ అయ్యే పోస్టులకు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. యూపీఎస్సీ తరహాలో పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి ఆర్కియాలజీ మినహా మిగిలిన 43 విభాగాల నియామకానికి ఎటువంటి కోర్టు అభ్యంతరాలు లేవన్నారు. ఆయా వర్సీటీల వీసీలు ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గ్రూప్-2 1999 నోటిఫికేషన్‌కు సంబంధించి సబ్ కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు అందచేసిందని, తదుపరి ఆదేశాలు కోర్టు నుంచి తమకు రాలేదన్నారు. ఈ సమావేశంలో ఎపీపీఎస్సీ సభ్యులు ఎస్.రూప, రంగ జనార్ధన్, విజయ్ కుమార్, సుజాత, పద్మరాజు, సెక్రటరీ వౌర్య పాల్గొన్నారు.