ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన పై కేంద్రం స్పందించింది. కేంద్ర విదేశాంగశాఖ అధికారులతో ఏపీ సీఎంవో చర్చలు జరిపింది. దీంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర విదేశాంగశాఖ కోరింది. దీంతో చంద్రబాబు పర్యటనకు లైన్ క్లియర్ అయింది. చంద్రబాబుతో పాటు 17 మంది బృందం 7 రోజుల పాటు దావోస్ వెళ్లడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. నిన్న చంద్రబాబు దావోస్ పర్యటన పై కేంద్రం ఆంక్షలు విధించింది. ప్రతి ఏడాది 14, 15 మంది ప్రతినిధులతో దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు చంద్రబాబు వెళుతున్నారు. ఈ ఏడాది ఏడు రోజుల పర్యటనను నాలుగు రోజులకు కుదించుకోవాలని కేంద్రం సూచించింది.
15 మందికి బదులు ఐదుగురే వెళ్లాలని ఆంక్షలు విధించింది. దీంతో ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దావోస్ వెళ్లేందుకు సీఎం కార్యాలయం కేంద్రం అనుమతి కోరింది. కేంద్రం ఆంక్షలు విధించడం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అనుమతి కోరాలని సీఎంవో అధికారులను ఆయన ఆదేశించిన విషయం తెలిసిందే. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించే స్వరంతో హెచ్చరించటంతో, ఇలాంటి విషయాలలో ఎక్కువ లాగితే, ఉన్నది కూడా ఊడుతుందని భావించి, కేంద్రం వెనక్కు తగ్గింది. అనవసర గొడవను నెత్తిన పెట్టుకోవటం ఎందుకని, చంద్రబాబు టూర్ కి పర్మిషన్ ఇచ్చింది.
ప్రతి సారీ చంద్రబాబుతో పాటు, ఆయన వెంట మంత్రులు, అధికారులతో కూడిన భారీ ప్రతినిధి బృందం దావోస్‌కి వెళ్లడం ఆనవాయితీ. ఈసారి కూడా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఆయనతోపాటు, మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ సహా 14 మంది సభ్యుల బృందం వెళ్లాలన్నది ఆలోచన. ఈ మేరకు రాజకీయ అనుమతుల కోసం కేంద్ర విదేశాంగ శాఖకు దరఖాస్తు చేయగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు అనుమతి ఇస్తూనే ఆంక్షలు విధించింది. అయితే ఈ విషయం పై కేంద్రం అతిగా జోక్యం చేసుకోవటంతో, చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో కేంద్రం దిగొచ్చి, ఆంక్షలు లేకుండా పర్మిషన్ ఇచ్చింది.