రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీల మధ్య కొనసాగుతున్న వివాదం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా కాంగ్రెస్ మాటల దాడి ఉధృతం చేసింది. రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన ఆధారాలన్నీ మాజీ రక్షణమంత్రి, గోవా సీఎం మనోహర్ పారికర్ వద్ద ఉన్నాయంటూ గోవా బీజేపీ మంత్రి చెబుతున్న ఆడియో రికార్డింగ్‌లు తమ వద్ద ఉన్నాయని ఆ పార్టీ ఆరోపించింది. రాఫెల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసేందుకు ప్రభుత్వం తటపటాయించడం వెనుక అసలు కారణం ఇదేనా అంటూ కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్రాన్స్ యుద్ధ విమానాల తయారీసంస్థ దసో ఏవియేషన్‌తో రాఫెల్ ఒప్పందం జరిగినప్పుడు పారికర్ కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.
కాగా గోవా మంత్రి విశ్వజిత్ రాణేకి మరో వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్‌ను సైతం ఇవాళ సుర్జేవాలా మీడియా ముందుకు తీసుకొచ్చారు. ‘‘రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన సమాచారం అంతా తన బెడ్రూమ్లోనే ఉందని, ఆ డాక్యుమెంట్లన్నీ తన ప్లాట్లోనే ఉన్నాయని ముఖ్యమంత్రి చాలా ఆసక్తికరమైన ప్రకటన చేశారు. కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేసేందుకు ఆయన వాటిని తనవద్ద అట్టిపెట్టుకున్నారు. ఇప్పుడు దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలి. మనోహర్ పారికర్ బెడ్రూమ్లో, ఆయన ఫ్లాట్‌లో రాఫెల్ కుంభకోణంపై ఎలాంటి సీక్రెట్లు ఉన్నాయో చెప్పాలని దేశం డిమాండ్ చేస్తోంది..’’ అని సుర్జేవాలా పేర్కొన్నారు.
కాగా కాంగ్రెస్ చెబుతున్న ఈ ఆడియో క్లిప్ నిజమైనదా కాదా అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే మంత్రి రాణే మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ ఆడియో టేపును కావాలని సృష్టించారని పేర్కొన్నారు. గతవారం జరిగిన గోవా కేబినెట్ సమావేశం సందర్భంగా... రాఫెల్ డీల్‌కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, మొత్తం ఫైలు తన బెడ్రూంలోనే ఉన్నదంటూ పారికర్ చెప్పినట్టు సదరు ఆడియో క్లిప్‌లో వినిపిస్తోంది. వ్యక్తిగతంగా తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవంటూ నిన్న ఓ ఇంటర్యూలో ప్రధాని మోదీ పేర్కొన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తాజా ఆరోపణలు చేయడం గమనార్హం.