రానున్న ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలందరూ కష్టపడి సమన్వయంతో పనిచేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి స్థాయి పెరుగుతోంది.. ఇలాంటి తరుణంలో అంతా మరింత కష్టపడి పనిచేయాలి.. మీరు బాగుంటేనే నాయకుడుగా నాకు మంచి పేరు.. మీలో ఏ ఒక్కరు సక్రమంగా లేకపోయినా నాకే చెడ్డపేరు వస్తుంది.. ఎన్నికలే లక్ష్యంగా అంతా కష్టపడి పనిచేయాలి.. ఏ చిన్న లోపం జరక్కూడదు.. ఇప్పటి వరకు ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ఉద్ఘాటించారు. సోమ వారం ఉండవల్లి ప్రజావేదిక సమావేశ మందిరంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎన్నికల వ్యూహంపై బాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఈనెల 30 నుంచి జరిగే శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా సేకరించిన భావి అభివృద్ధి ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళతామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 1,2,3 తేదీలలో పింఛను పండుగ నిర్వహిస్తున్నామన్నారు. రాజమండ్రిలో జయహో బీసీ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. నెగటివ్ పబ్లిసిటీ ఎప్పుడూ పనిచేయదన్నారు. నాలుగేళ్లలో 6లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఒకరు.. 11 లక్షల కోట్లు జరిగిందని మరొకరు తమపై అభాండాలు వేస్తున్నారని బడ్జెట్‌కు మించిన అవినీతి జరిగిందంటే ప్రజలెలా నమ్ముతారని ప్రశ్నించారు. ‘మళ్లీ నువ్వే రావాలి’ అనే నినాదం ప్రజల నుంచి పుట్టుకొచ్చిందని దీంతో వైసీపీలో దడ పుట్టిందన్నారు. అందుకే నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని మండిపడ్డారు.
నిన్నునమ్మం బాబు అనే ప్రచారం ఇందులో భాగమే అన్నారు. వైసీపీ నెగటివ్ భావజాల పార్టీ అని, ప్రతిపక్షనేత జగన్ నెగటివ్ లీడర్ అని ఎద్దేవా చేశారు. ఆరేళ్ల క్రితం వివాదంపై షర్మిలతో ఇప్పుడు ఫిర్యాదు చేయిస్తున్నారని, అందుకే ప్రజలు పట్టించుకోవటంలేదని స్పష్టం చేశారు. ప్రజల్లో పాజిటివ్‌నెస్‌కే ప్రాధాన్యత ఉంటుందన్నారు. సానుకూలతవైపే వారు మొగ్గుచూపుతారని ప్రతికూలతలను వ్యతిరేకిస్తారన్నారు. గత నాలుగున్నరేళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించాం.. పెద్దఎత్తున పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేశాం.. ఇంత అభివృద్ధి, సంక్షేమం ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు. నీటిపారుదల ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తున్నామని, సీమ జిల్లాలకు సాగునీరందిస్తున్నామని పునరుద్ఘాటించారు. కేంద్రం తోడ్పాటు లేకున్నా స్వయంకృషితో రాష్ట్భ్రావృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.