కొందరు శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు ఎన్నిసార్లు చెప్పినా...వారి పనితీరులో మార్పురావడం లేదని, ప్రజలకు దగ్గరవడం లేదని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెలా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జుల పనితీరుపై ప్రజల, పార్టీ కేడర్ అభిప్రాయం ఎలా ఉందో బహిరంగంగానే ప్రకటిస్తానన్నారు. పోటీలో తట్టుకుని నిలబడగలం అనుకున్నవారు ఉంటారని, ఎవరైనా మేం చేయలేమని చెబితే... వేరే వాళ్లను చూసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల పట్ల విశ్వాసపాత్రులుగా ఉండేవారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తానన్నారు. సోమవారం ఉండవల్లిలోని ప్రజా వేదికలో చంద్రబాబు అధ్యక్షతన పార్టీ సమన్వయ సమావేశం జరిగింది.
జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులు, ముఖ్యనేతలు జిల్లాల నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘‘ఇన్ని రోజులూ సున్నితంగా చెప్పినా కొందరిలో మార్పు రావడం లేదు. ఇకపై గట్టిగానే చెబుతా. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ప్రజలకు విశ్వాసపాత్రులుగా ఉంటామని మీ అందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తాను. అలా ఉన్నవారికే టిక్కెట్లు’’ అని ఆయన స్పష్టంచేశారు. ‘ఏ కార్యక్రమంపై సీరియస్‌నెస్ ఉండదు.. వన్‌టూ వన్ మాట్లాడినా మార్పు రాదు. మీరేమయినా అతీతులా..? నేనే ప్రజలతో మమేకమయ్యే నేతలను మాత్రమే ప్రమోట్ చేస్తా. ఎంత నాయకుడైనా పరిస్థితి బాగోలేకపోతే ఏమీ చేయలేను’ అని గుంటూరు జిల్లా నేతల పై మండిపడ్డారు.
‘రాజధాని జిల్లాలో నేతలు ఎలా ఉండాలి.. కానీ మీ పనితీరు చూస్తుంటే బాధేస్తుంది. సీనియర్లమనే ధీమా బాగా పెరింగింది. అంత ధీమా ఉన్న నేతలు రాష్ట్రంలో ఎక్కడా లేరు. మొన్న సత్తెనపల్లి సభలో ప్రజలను చూస్తే ఉత్సాహం పెరిగింది.. ఆ ఉత్సాహం మీలో లేదు. మీటింగ్‌లకు పూర్తిగా హాజరు కారు... పార్టీ పని సక్రమంగా చేస్తానని ప్రమాణం తీసుకున్న తరువాతే సీట్లు ఇవ్వాల్సి పరిస్థితి’ అంటూ మండిపడ్డారు. పార్టీ ఆదేశాల మేరకు పనిచేయాలన్నారు. శాసనసభ్యుల పనితీరుపై ప్రతి నియోజకవర్గంలోను ప్రతి నెలా 25 వేల మంది నుంచి... వివిధ మార్గాల్లో అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా... శాసనసభ్యులు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోతే ప్రజలు ఆమోదించడం లేదన్నారు. తాను కుప్పం నియోజకవర్గానికి వెళ్లకపోయినా ప్రజలు అంగీకరించడం లేదన్నారు