సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇచ్చిన రెండు రోజుల్లోనే మోడీ భయపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత కమిటీ సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఆలోక్ వర్మను తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. 24 గంటల్లో రెండుసార్లు సమావేశమైన హైపవర్డ్ కమిటీ గురువారం అలోక్ వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ కే సిక్రి, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. సీబీఐ చీఫ్ విషయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. అలోక్ వర్మపై ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్లు హైపవర్డ్ కమిటీ గుర్తించినట్లు తెలుస్తోంది. అలోక్ వర్మను సీబీఐ చీఫ్ పదవి నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ, జస్టిస్ సిక్రి సమర్థించగా, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించినట్లు సమాచారం. అలోక్ వర్మను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా ప్రభుత్వం నియమించింది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 12 మంది సీబీఐ అధికారులను బదిలీ చేశారు. అయితే రాఫెల్ కుంభకోణం పై, అరుణ్ శౌరీ ఇచ్చిన కంప్లైంట్ పై, అలోక్ వర్మ, ఈ రోజో, రేపో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సిబిఐ కేసు నమోదు చేస్తారనే వార్తలు వచ్చాయి. దీంతో మోడీ అలెర్ట్ అయ్యారు. అందుకే ఉన్నట్టు ఉంది, అలోక్ వర్మను తప్పించారని తెలుస్తుంది. అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్‌ను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత విధుల్లో చేరిన మరుసటి రోజే ఆయన్ను తొలగిస్తున్నట్లు మోదీ నేతృత్వంలోని కమిటీ ప్రకటించడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ నిర్ణయం వెలువడటానికి కొన్ని గంటల ముందు ఐదుగురు సీబీఐ ఉన్నతాధికారులను బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అస్థానా కేసును విచారిస్తోన్న డీఐజీ ఎంకే సిన్హా, డీఐజీ తరుణ్ గౌబా, జేడీ మురుగేశన్, ఏడీ ఎ.కె.శర్మను బదిలీ చేశారు. దీంతో పాటు అస్థానా కేసు విచారణను 2006 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన అధికారి మోహిత్ గుప్తాకు అప్పగించారు. తాను సెలవులో ఉన్న సమయంలో తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వర్రావు చేపట్టిన బదిలీలను వర్మ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలోక్ వర్మను విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.