గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి మొదటి ఇంటర్నేషనల్ సర్వీస్ విజయవాడ - సింగపూర్ ఫ్లైట్ మొదలైన రోజున, ఏపి ప్రభుత్వం, ఎయిర్ పోర్ట్ అధికారులు ఎంతో ఆందోళన చెందారు. డిమాండ్ ఎలా ఉంటుందో, మొదటి అంతర్జాతీయ సర్వీస్ సక్సెస్ అవుతుందో లేదో, కేంద్రంతో పోరాడి మరీ, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేసి మరీ ప్రారంభిస్తున్నాం అంటూ కంగారు పడ్డారు. కాని, ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి, తమ అంచనా తప్పని, ఇది సూపర్ హిట్ అయ్యిందని సంబర పడుతున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులను ఆరంభించాక.. ప్రయాణికులు అలవాటు పడేందుకు 4-5 నెలల సమయం పడుతుందని అధికారులు భావించారు. అందుకే.. 50శాతం కంటే తక్కువ మంది ప్రయాణికులు ఉంటే ఇండిగోకు లోటు సర్దుబాటునిధి(వీజీఎఫ్)ని కూడా ఆరు నెలలకు రూ.18 కోట్ల చొప్పున ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ అవసరం లేకుండానే ప్రయాణికుల రద్దీ నెల రోజుల వ్యవధిలోనే పుంజుకుంది.
రాష్ట్రప్రభుత్వం, భారత విమానయాన సంస్థ(ఏఏఐ)తో చేసుకున్న ఒప్పందం మేరకు ఇండిగో సంస్థ 180 సీటింగ్ ఉన్న ఎ320 ఎయిర్‌బస్ సర్వీసులను ఆరంభించింది. గత డిసెంబరు 4 నుంచి ఆరంభమైన ఈ సర్వీసులకు తొలుత సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండేది. ప్రస్తుతం విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అతితక్కువ కాలంలోనే ఏపీ నుంచి కూడా 90శాతం పైగా ఆక్యుపెన్సీని సాధించింది. జనవరి ఒకటో తేదీన ఇక్కడి నుంచి బయలుదేరివెళ్లిన విమాన సర్వీసులోని 180 సీట్లూ పూర్తిగా నిండిపోయాయి. నాటి నుంచి అదే రద్దీ కొనసాగుతోంది.
సింగపూర్ నుంచి గన్నవరం వచ్చే సర్వీసుల్లో డిసెంబరు నాలుగో తేదీన 170మంది, ఆరున 165, 11న 177, 13న 168మంది ప్రయాణికులు వచ్చారు. అదే సమయంలో విజయవాడ నుంచి సింగపూర్‌కు డిసెంబరు 4న 86, 6న 42, 11న 86, 13న 68 మంది వెళ్లారు. జనవరి నెలారంభం నుంచి అనూహ్యంగా ఇటునుంచి రద్దీ పెరిగింది. విజయవాడ నుంచి సింగపూర్‌కు జనవరి 1న 180, 3న 178, 8న 153, 10న 155 మంది ప్రయాణికులు వెళ్లారు. సింగపూర్ నుంచి జనవరి 1న 81, 3న 88, 8న 80, 10న 128మంది ప్రయాణికులు విజయవాడకు వచ్చారు. అమెరికా, చైనా, జపాన్, ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా, కెనడా, ఉక్రెయిన్, జర్మనీ లాంటి దేశాలకు వెళ్లేవాళ్లంతా గన్నవరం నుంచి నేరుగా సింగపూర్‌కు చేరుకుని.. అక్కడి నుంచి తేలికగా వారి గమ్యస్థానాలకు వెళ్లిపోయే వీలుంది. ఇలాంటి వారంతా ప్రస్తుతం సింగపూర్ సర్వీసును వినియోగించుకుంటున్నట్టు తెలుస్తుంది.