హైదరాబద్ లో ఉండే ఒక బ్యాచ్ కి, ఆంధ్రప్రదేశ్ అంటే మరీ చులకన అయిపొయింది. ఇందులో మొదటి స్థానం మాత్రం వైసీపీకే ఇవ్వాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డాక్టర్లు అంటే నమ్మకం లేదని, ఏపి పోలీస్ అంటే నమ్మకం లేదని, ఏపి కోర్ట్ లు అంటే నమ్మకం లేదని, జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలు చూసాం. ఇప్పుడు ఈయనకు తోడు, ఈయన చెల్లలు షర్మిల రెడీ అయ్యారు. సోషల్ మీడియాలో తన పై వ్యక్తిగతంగా దాడి జరుగుతుందని, దానికి కారణం చంద్రాబాబే అని, అయితే ఏపి పోలీసుల పై నమ్మకం లేదని, హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది షర్మిల.. వీరికి ఏపిలో, దేని పైనా నమ్మకం ఉండదు కాని, ఏపిలో ఉన్న సియం కుర్చీ పై మాత్రం, ఎంతో ప్రేమ ఉంటుంది.
అయితే షర్మిల వ్యాఖ్యల పై, ఏపీ పోలీసు అధికారుల సంఘం స్పందించింది. విజయవాడలో సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏపీ పోలీసు మీద నమ్మకం లేదనడం రాష్ట్ర పోలీసుల మనోభావాలను దెబ్బతీయటమే అని అన్నారు. దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఓ ప్రత్యేకత ఉందని గుర్తు చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే ఇటువంటి వ్యాఖ్యలే చేస్తారా అని ప్రశ్నించారు. జగన్ పై దాడి కేసులో కూడా ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడం విచారకరమని, పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్రంలోని 60 వేల మంది పోలీసుల మనో స్థైర్యం దెబ్బతీయటమే, ఏపీ పోలీసులు వైఎస్ హయాంలో కూడా పని చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు.
ఏ రాష్ట్ర పరిధిలో జరిగితే, అక్కడే కేసులు నమోదవుతాయని చెప్పారు. రానున్న రోజుల్లో వారి ప్రభుత్వం (వైసీపీ) వచ్చినా... రాష్ట్రంలోని అన్ని కేసులను ఏపీ పోలీసులే విచారించాల్సి ఉంటుందని తెలిపారు. దేశంలోనే ఏపీ పోలీసులు బెస్ట్ అనే కితాబులు తామకు చాలా సార్లు వచ్చాయని అన్నారు. మరో పక్క తెలుగుదేశం నేతలు కూడా ఈ వ్యాఖ్యల పై స్పందించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిళపై సోషల్మీడియా ప్రచారానికి టీడీపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ఆరోపణలను ప్రోత్సహించరని అన్నారు. వ్యక్తిగత ఆరోపణలు ఏ పార్టీ వాళ్లు చేసినా ఖండించాల్సిందేనని అన్నారు. జగన్ను రాజకీయంగా విమర్శించాం గానీ.. షర్మిళను ఏనాడూ ప్రస్తావించలేదని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.