సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకోవడం ఆనందంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని తితిదే కల్యాణ మండపంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందన్నారు. ‘‘ప్రజలకు మేలు జరగాలని 24 గంటలు కష్టపడ్డాం. దాని ప్రభావం రాబోయే రోజుల్లో చూస్తారు. నరేంద్రమోదీ, కేసీఆర్, జగన్ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు.. అది సాధ్యం కాదు. విభజన చట్టంలో హామీలు భాజపా అమలు చేయలేదు. దర్యాప్తు సంస్థలు, వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. సీబీఐ, ఈడీ దాడులతో అణచివేయాలని చూశారు. అన్యాయం చేసినప్పుడే తిరుగుబాటు చేశాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితికి వస్తున్నాం’’ అని చంద్రబాబు అన్నారు.
అలాగే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై కూడా చంద్రబాబు స్పందించారు. కేసీఆర్తో జగన్ కుమ్మక్కయ్యారని పవన్ చెప్పారని, ఆఖరికి తాము చెప్పిందే పవన్ కూడా ఒప్పుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి కుమ్మక్కు రాజకీయాన్ని ఏపీ తిప్పికొట్టబోతోందని ఆయన చెప్పారు. ఏపీలో ఉంటూ, ఏపీలో రాజకీయ పార్టీ నడుపుతూ ఏపీలో వ్యవస్థపై నమ్మకం లేదంటారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి వారిని ఏం చేయాలో జనమే నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్, మోదీ, జగన్ ఏకమైనా జనం అభిప్రాయం మార్చలేరని, ఏపీలో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించబోతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జనం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలన్నీ కలిసిరావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీతో కలిసి టీఆర్ఎస్ ఇక్కడ పోటీ చేయొచ్చు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, పోలవరానికి ఎందుకు అడ్డంపడ్డారని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వైసీపీ ఎందుకు మాట్లాడదని మండిపడ్డారు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే మోదీ ప్రభుత్వం పోవాలని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్తో కలిసి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెబుతున్నారని, టీఆర్ఎస్, జగన్, మోదీ అంతా ఒకటే కదా.. హోదాపై ఎందుకు ప్రకటన చేయించరని చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలన్నీ కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కలిసి వచ్చే పార్టీలుంటే ముందుకు రావాలంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.