తెరాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడలో తలపెట్టాలనుకున్న ర్యాలీకి పోలీసులు నిరాకరించారు. సోమవారం ఉదయం విజయడవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆర్కే కాలేజీలో నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళ కార్యక్రమానికి విచ్చేసిన తలసానికి ఆర్కే కాలేజ్ ఛైర్మన్ ఎం.కొండయ్య, ఇతర యాదవ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆర్కే కాలేజ్ నుంచి కనక దుర్గ ఆలయం వరకు నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు నిరాకరించారు. ర్యాలీకి సంబంధించి ముందస్తుగా అనుమతి తీసుకోకపోవడంతో నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎలాంటి ఆర్భాటం లేకుండా కేవలం ఐదు వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు.
తరువాత, బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఇంద్రకీలాద్రి పై మీడియాతో మాట్లాడిన తలసాని... రాజకీయ వ్యాఖ్యలు చేడం వివాదంగా మారుతోంది. దుర్గమ్మ సన్నిధిలో ఇంద్రకీలాద్రి పై తలసాని రాజకీయాలు మాట్లాడడాన్ని దుర్గగుడి పాలక మండలి సభ్యులు తప్పుపడుతున్నారు. తలసాని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు పాలక మండలి సభ్యులు.. తలసాని రాజకీయాలు మాట్లాడుతుంటే వారించలేకపోయారంటూ ఆలయ సిబ్బందిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామంటున్నారు సభ్యులు.
దుర్గమ్మ ఆలయంలో తలసాని రాజకీయాలు మాట్లాడతారా..? అంటూ మండిపడ్డారు పాలక మండలి సభ్యులు పెంచలయ్య... ఆలయ పవిత్రత దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించిన ఆయన... తలసాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భీమవరంలో కోడిపందాలు ఆడటానికి వెళ్తూ దుర్గమ్మ ఆలయంలో అడ్డమైన ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన... రాజకీయలు మాట్లాడుతున్నా ఆలయ అధికారులు అడ్డుకొకపోవటం సరికాదన్నారు. తలసాని క్షమాపణలు చెప్పకపోతే పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు పెంచలయ్య.