ఆంధ్రప్రదేశ్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది భారతీయ జనతా పార్టీ. విభజన హామీల అమలు విషయంలో ఏపీని మోసం చేసిందనే కారణంతో ఆ పార్టీని అక్కడి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. టీడీపీ-బీజేపీ దూరమైనప్పటి నుంచే ఈ పరిస్థితి వచ్చింది. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పని చేశాయి. అప్పటి ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పైడికొండల మాణిక్యాలరావు, కృష్ణా జిల్లా కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆకుల సత్యనారాయణలు బీజేపీ తరపున శాసనసభకు ఎన్నికైన వారిలో ఉన్నారు. వీరిలో మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావులకు చంద్రబాబు తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. అయితే, టీడీపీ.. ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన సమయంలో వీరిరువురూ తమ పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి వైదొలిగారు.
ఇప్పుడు ఈ నలుగురు ఎమ్మెల్యేలలో ఎవరు ఆ పార్టీలో ఉంటారో.. ఎవరు ఉండరో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో వారిలో ఓ ఎమ్మెల్యే గురించి సంచలన విషయం బయటకు వచ్చింది. విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బిజెపికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బిజెపితో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో ఆయన తీవ్రమైన ఒత్తిడికి గురువుతున్నట్లు తెలుస్తోంది. గత మూడు నెలలుగా ఆయన బిజెపి సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. అయితే జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించే సభలు, సమావేశాలకు మాత్రం హాజరవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తరపున మళ్లీ పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే అనుమానం విష్ణుకుమార్ రాజును వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.
ఆయన 15 ప్రశ్నలతో ప్రజానాడిని తెలుసుకోవడానికి ఆయన మిత్రబృందం నియోజకవర్గంలో సర్వే చేయించినట్లు సమాచారం. ఫలితం ఆయనకు అనుకూలంగా వచ్చినట్లు చెబుతున్నారు. దాంతో తిరిగి పోటీ చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. అయితే, ఎక్కువ మంది ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడిపికి ఓటు వేస్తామని సర్వేలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. విభజన హామీలు, ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో పార్టీ హైకమాండ్ వైఖరితో ఆయన ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.