కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న పోరాటానికి, భాజపాయేతర శక్తుల్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ మరోసారి సంఘీభావం ప్రకటించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం మనదేనని అన్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైనందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ ఆయన ఇటీవల లేఖ రాశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ చర్యల్ని ఎండగడుతూ చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని స్టాలిన్ తన లేఖలో ప్రస్తావించారు. మోడీ చర్యల వల్ల దేశ ప్రజల పడుతున్న ఇబ్బందులు, వాటిని ఐక్యంగా కలిసి ఎలా పోరాడాలి వంటి అంశాలు ప్రస్తావించారు.
‘‘ఆ రోజు మీరు చెప్పినట్టుగా.. నాలుగున్నరేళ్ల క్రితం అనేక ఆశలతో ప్రజలు ఎన్నుకొన్న భాజపా ప్రభుత్వం పలు రాజ్యాంగబద్ధ సంస్థల్ని నాశనం చేసింది. సమాఖ్య స్ఫూర్తికి, లౌకికత్వానికి ముప్పు వాటిల్లింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి అనాలోచిత, తొందరపాటు చర్యలతో వేగంగా వృద్ధి చెందుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. డెభ్భై ఏళ్ల స్వతంత్ర భారతావని చరిత్రలో ఇలాంటి అసమర్థ ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. బెదిరింపులు, దాడులు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం.. ఇలా తమ విధ్వంసకర అజెండాను అమలు చేస్తున్న శక్తుల నుంచి జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
‘‘ఆ రోజు మీరు చెప్పిన మాటలు.. ఆ కార్యక్రమానికి హాజరైన నాయకులు చూపించిన ఐక్యభావం, పట్టుదల నాలోను, భారత జాతిలోను కొత్త ఆశను రేకెత్తించాయి. మనందరి కృషితో దేశ సౌభాగ్యాన్ని పెంపొందించగలమని, సౌభ్రాతృత్వాన్ని, మత సహనాన్ని పునరుద్ధరించగలమని గట్టిగా నమ్ముతున్నాను’’ అని ఆ లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా మోడీ చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా, మొదటగా గళం ఎత్తింది చంద్రబాబు మాత్రమే. బీజేపీ యేతర పార్టీలను ఏకం చేసి, సేవ్ నేషన్ పేరుతో చంద్రబాబు రంగంలోకి దిగారు. చంద్రబాబుకి మద్దతుగా, ఢిల్లీలో 22 పార్టీలు కలిసి, మోడీ పై పోరాటం చెయ్యాల్సిన అంశాలను రెడీ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, ప్రతిపక్షాల ఐక్యత పెంచేలా స్టాలిన్, చంద్రబాబుకు లేఖ రాసారు.