కనకదుర్గా ఫ్లై ఓవర్ భవితవ్యంపై నెలకొన్న చిక్కుముడి వీడింది. ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ను ఒడ్డున వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపింది. కేంద్రం నుంచి నిధుల విడుదలకు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు చెల్లించేందుకు మార్గం సుగమం చేసింది. మరోవైపు కార్మికులు కూడా పూర్తి స్థాయిలో సమ్మెను విరమించి విధులకు హాజరు కావటంతో దుర్గా ఫ్లై ఓవర్ పనులు తిరిగి పట్టాలెక్కాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దుర్గా ఫ్లై ఓవర్ కాంట్రాక్టు సంస్థ కొద్దినెలలుగా కార్మికులకు సరిగా జీతాలు చెల్లించలేకపోతోంది. వరుసగా నాలుగునెలల నుంచి జీతాలను చెల్లించకపోవటంతో ఓపిక పట్టిన కార్మికులు మెరుపు సమ్మెకు దిగటంతో దుర్గా ఫ్లై ఓవర్ పనులు అర్థంతరంగా నిలిచిపోయాయి.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో సోమా ప్రతినిధులను ఆగమేఘాల మీద గురువారం సాయంత్రం సచివాలయానికి పిలిపించారు. రాజధానిలో శంకుస్థాపనలు ఉన్నందున సీఎం వారితో సమావేశం కాలేకపోయారు. సీఎం పాల్గొనలేకపోయినా వ్యక్తిగత కార్యదర్శి రాజమౌళి సమక్షంలో అధికారులతో సమావేశం కావాలని సూచించారు. సోమా ఆర్థిక ఇబ్బందుల గురించి సీఎంవో అధికారులు ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర రూ.6 కోట్ల బిల్లులకు సంబంధించి నిలిచిపోయాయని సోమా ప్రతినిధులు తెలిపారు. దీనిపై రీవాల్యుయేషన్ త్వరగా పూర్తిచేసి కేంద్ర స్థాయిలో మాట్లాడి త్వరగా బిల్లు మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
శనీశ్వరాలయం దగ్గర చేపట్టిన వయాడక్ట్ పనులకు సంబంధించిన రూ.6.50 కోట్ల బిల్లులకు కూడా తమకు స్పష్టత లేదని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ పనుల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని గతంలో నిర్ణయించటంతో అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. తక్షణం బిల్లులు పెట్టి క్లెయిమ్ చేసుకోవాల్సిందిగా కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు సూచించారు. దీంతో సోమా సంస్థకు గొప్ప ఊరట లభించినట్టు అయింది.అతి త్వరలో కాంట్రాక్టు సంస్థకు అటు కేంద్ర బిల్లులు, ఇటు రాష్ట్ర బిల్లులు కలిపి రూ.12 కోట్లు సర్దుబాటయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో కాంట్రాక్టు సంస్థ ‘సోమా’కు మరో ఊరట లభించింది. మెరుపు సమ్మెలోకి దిగిన కార్మికులు కూడా పట్టు సడలించారు. సోమా ప్రతినిధులు పండుగ లోపు అంటే జనవరి 10 వ తేదీన రెండు నెలల జీతాలు చెల్లిస్తామని హామీ ఇవ్వటంతో పూర్తి స్థాయిలో 450 మంది కార్మికులంతా సమ్మె విరమించారు.