తన పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందంటూ.. వైఎస్ షర్మిల చేసిన ఆరోపణల గురించి తెలిసిందే. తనకు, సినీ హీరో ప్రభాస్‌కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ షర్మిల.. హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందంటూ.. ఫిర్యాదు సందర్భంగా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. టీడీపీ అధినేత చంద్రబాబుపైనా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఆయన కొట్టిపారేశారు.
హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసి.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుబట్టారు. ఇతర టీడీపీ నేతలు సైతం షర్మిల తీరును తప్పుబట్టారు. ఇదంతా వైసీపీ ఎన్నికల స్టంటని కొట్టిపారేశారు. తాజాగా, షర్మిల వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. షర్మిల తనకు కూతురులాంటిదని స్పష్టం చేశారు. ఆమెను తానెప్పుడూ విమర్శించలేదని చెప్పారు. గతంలో కులాంతర వివాహం జరిపించినందుకు వైఎస్ కుటుంబాన్ని తాను అభినందించానని గుర్తు చేశారు. వైఎస్ కుటుంబం కులాలను రెచ్చగొట్టడంపైనే తాను విమర్శలు చేశాను తప్ప.. ఇతరత్రా విషయాలేవీ ఇంతవరకూ ప్రస్తావించలేదన్నారు. షర్మిలను విమర్శించిన ఉంటే తనకు పాపం తగులుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ నుంచి వచ్చి బురద చల్లడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఎవరు ఎంత మందిని కలిసినా టీడీపీ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. వైసీపీ, టీఆర్ఎస్ దోస్తీ గురించి తమకు ముందే తెలుసన్నారు. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు కలవడం ఏంటి.. ఏడాది నుంచే కలిసి పనిచేస్తున్నాయని జేసీ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నారు. దేశంలో ఎవరు ఎక్కడికైనా రావొచ్చని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ లేదు.. పాడు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కోసారి ఒక్కొక్కరికి కోపం వస్తుందని, ఇప్పుడు కేసీఆర్‌కు వచ్చిందని తెలిపారు.