నిజానికి ఇది అనూహ్య పరిణామం కాదు.. అందరికీ తెలిసిన రహస్యమే అయినా, ఇంత ఓపెన్ గా, వస్తారని ఎవరూ అనుకోలేదు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్‌తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశకానుండడం ఆసక్తి రేపుతోంది. చంద్రబాబును టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్న టీఆర్ఎస్.. వైసీపీతో ములాఖత్ వెనుక కథేంటి? అసలు ఈ భేటీలో ఏయే అంశాలు చర్చకు రానున్నాయి. చంద్రాబాబుని అడ్డు తొలగించుకుని, ఏపిని ఎలా తన గుప్పిట్లో పెట్టుకోవాలని కేసీఆర్ చూస్తున్నాడు. ఇప్పుడే ఇదే హాట్ టాపిక్. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో భాగంగా జగన్‌తో చర్చలకు సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది. పైకి ఫెడరల్ ఫ్రంట్ చర్చలు అని చెబుతున్నా.. ఏపీ రాజకీయాలు ప్రస్తావన తప్పక ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. రాజకీయంగా కేటీఆర్ తొలిసారి ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌తో చర్చలు జరపనుండడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ప్రజలు ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.. ఎందుకంటే కేసీఆర్ తిట్టిన తిట్లు అన్నీ ఇన్నీ కావు. ఆంధ్రా ప్రజలను టార్గెట్ చేసుకుని, ఎంతో హీనమైన భాష వాడాడు. ఉద్యమ సమయంలో మాట్లాడిన మాటలు అని సమర్ధించుకున్నా, తాను ముఖ్యామంత్రి అయిన తరువాత కూడా, ఆంధ్రా పై విషయం చిమ్మాడు. ఆంధ్రాని థర్డ్ క్లాస్ స్టేట్, మాది రిచ్ స్టేట్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకా ప్రజలకు గుర్తున్నాయి.
ఇక ఈ పరిణామాలన్నింటినీ జనసేన పార్టీ ఆసక్తికరంగా పరిశీలిస్తోంది. అయితే.. జగన్‌తో మాత్రమే కాదు.. పవన్‌తో కూడా ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతు కోరుతూ సంప్రదింపులు జరపాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. పవన్ కూడా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనకు మద్దతు తెలిపితే.. జగన్‌తో పాటు ఒకే వేదిక పంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మరోసారి వేడెక్కింది. బీజేపీ వెనక ఉండి టీఆర్ఎస్, వైసీపీల సాయంతో ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందనే వాదనను టీడీపీ ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ప్రజలలో కూడా ఇదే వాదన ఉండి. ఇలా ఏ విధంగా చూసినా టీఆర్ఎస్ ఏపీ పొలిటికల్ ఎంట్రీ రాజకీయంగా తమకే కలిసొస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే... వైసీపీ కూడా టీఆర్ఎస్ మద్దతును తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఇప్పటికే వ్యూహాలు రచిస్తోంది. మరి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.