ఏపీకి సీఎం కేసీఆర్ రావొచ్చని, వస్తే తాము డబుల్ గిఫ్ట్‌లు ఇస్తామని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. ఏడాదిగా సీఎం చంద్రబాబు చెబుతున్న విషయాలు నిజమయ్యాయని, ప్రధాని మోదీ డైరక్షన్‌లో కేసీఆర్, జగన్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. పదవులు, ఆస్తుల పరిరక్షణ కోసం ఏమైనా చేస్తారని తేలిపోయిందని, వైసీపీకి అంతిమ ఘడియలు వచ్చాయని జోస్యం చెప్పారు. జగన్ తీరును చూసి ప్రజలు ఛీకొడుతున్నారని, ఏపీలో కేసీఆర్ విష రాజకీయాలు చేస్తున్నారని బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదని, కేసీఆర్ మాదిరిగా ఇక్కడికి.. అక్కడికి ఎవరూ రావొద్దని తాము చెప్పబోమని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.
జగన్, కేటీఆర్ ల భేటీపై ఏపీ మంత్రి నారాయణ స్పందించారు. ఇంతవరకు తెరవెనుక ఉన్న కుట్ర... ఇప్పుడిప్పుడే బయటకు వస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పిందే జరుగుతోందని అన్నారు. జగన్, కేటీఆర్ ల మధ్య చర్చలతో ఆ విషయం బట్టబయలైందని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీని వదిలేని... రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న చంద్రబాబుపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం మోదీతో జగన్ లాలూచి పడ్డారని ఆరోపించారు. బీజేపీ లేని కేంద్ర ప్రభుత్వం ఏర్పడితేనే ఏపీకి మంచి జరుగుతుందని అన్నారు. మోదీని మళ్లీ ప్రధానిని చేసేందుకే కేసీఆర్ మూడో ఫ్రంట్ ను తెర మీదకు తెస్తున్నారని చెప్పారు. ముగ్గురు మోదీల డ్రామా ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తోందని ఎద్దేవా చేశారు.
మరో పక్క మంత్రి దేవినేని ఉమ స్పందించారు. ఫెడరల్ ఫ్రంట్ కాదని, మోదీ ఫ్రంట్ అని ఎద్దేవాచేశారు. ముగ్గురు మోదీల జగన్నాటకమని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ దూషణలను ఏపీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, ఏపీ ప్రజలను తిట్టిన కేసీఆర్‌తో కలవడానికి జగన్‌కు సిగ్గుండాలన్నారు. హైదరాబాద్‌లో ఏపీ వాళ్లు కిరాయిదారులే అన్నారని, ఏపీ బ్రాహ్మణులకు మంత్రాలు కూడా రావని తిట్టారని దేవినేని ఈ సందర్భగా గుర్తుచేశారు. లంకలో పుట్టినవాళ్లు అందరూ రాక్షసులేనని కేసీఆర్ తిట్టలేదా అని ప్రశ్నించారు. తెలుగు తల్లి అంటే దెయ్యమని కేసీఆర్ దూషించారని, ఆంధ్రావాళ్ల బిర్యాని పేడలా ఉంటుందని కేసీఆర్ అనలేదా అని మరోసారి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుపై కక్షతో కేసీఆర్ నీచరాజకీయాలు చేస్తున్నారని దేవినేని ఉమ దుయ్యబట్టారు.