ఆంధ్రప్రదేశ్‌కు జీవన్మరణ సమస్యగా మారిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసి ఆపటానికి ప్రయత్నాలు చేస్తుందో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పోలవరం పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి మనసు లేదని, పోలవరం శాస్వతంగా ఆగిపోయే కుట్ర జరుగుతుందని, అందుకే భారతదేశంలోనే అత్యున్నతమైన, ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టుకు డిజైన్లు, తుది అంచనాలను కేంద్రం ఆమోదించడం లేదని విమర్శించారు. సంవత్సరం క్రితం కాంట్రాక్టర్ ను మార్చటం దగ్గర నుంచి, డీపీఆర్ - 2 ఆమోదించకుండా కాలయాపన చేస్తున్న ప్రాతి విషయం చెప్పారు. పోలవరం డిజైన్ అనుమతులు ఎలా కాలయాపన చేస్తుంది వివరించారు. ఖర్చు రాష్ట్రం పెట్టుకుంటుంటే, కేంద్రం అవి ఇవ్వటానికి సంవత్సరాలు తీసుకుంటుందని, దీని వల్ల రాష్ట్రం పై వడ్డీ భారం పడుతుందని అన్నారు. గడ్కరీ పోలవరం వచ్చిన సందర్భంలో, ముందుగా 10 వేల కోట్లు ఇవ్వమంటే, ఇస్తామని చెప్పి వెళ్లిపోయారని, ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదని, మన పనులు ఆపకుండా, మన నిధులు ఖర్చు పెడుతున్నామని అన్నారు.
పోలవరం కాంక్రీట్ పనుల్లో ప్రపంచ రికార్డు సాధించిన నేపథ్యంలో సోమవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఆయన పైలాన్ ఆవిష్కరించారు. జాతీయ మీడియా ప్రతినిధులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘పోలవరం కాంక్రీట్ పనుల్లో ప్రపంచ రికార్డు సాధించడం చాలా సంతోషంగా ఉంది. 24 గంటల్లో నిర్విరామంగా 32,315.5 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి ప్రపంచానికి తెలుగువారి సత్తా చూపాం. మరెవరూ ఈ రికార్డును బ్రేక్ చేయలేరు. ప్రాజెక్టు సామర్థ్యం, సమయం దృష్టిలో ఉంచుకుని ఈ విషయం చెబుతున్నాను. ఇది ఒక్క రోజులోనే సాధించిన విజయం కాదు. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చేసి సమీక్షిస్తున్నా. సీడబ్ల్యూసీ, పీపీఏతోపాటు ప్రాజెక్టు నిర్మాణంలో సహకరించినవారందరికీ ధన్యవాదాలు. డయాఫ్రమ్‌వాల్ విషయంలో నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు ప్రాజెక్టు నిర్మాణం జరిగేది కాదు. కెల్లర్, ఎల్‌అండ్‌టీ, నవయుగ వంటి సంస్థలు వెనక్కు తగ్గితే ఈ దశకు వచ్చేది కాదు. నవయుగ ఒక యాగంలా ప్రతిరోజూ పని చేస్తోంది. ఈ ప్రాజెక్టు దేశానికే తలమానికం. 670 అవార్డులు వచ్చినా రాని తృప్తి పోలవరం ప్రాజెక్టుతో వచ్చింది. మార్చిలో 65,000 క్యూబిక్ మీటర్ల బెంచ్‌మార్కును సాధించాలి. రాష్ట్రానికి జీవన రేఖలాంటి ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంపై చాలా అసంతృప్తితో ఉన్నాం."
"ప్రాజెక్టు తుది అంచనాలో రూ.33,000 కోట్లు భూసేకరణ, సహాయ పునరావాసానికి, రూ11,000 కోట్లు ప్రధాన ప్రాజెక్టుకు, రూ.45,000 కోట్లను కుడి, ఎడమ పవర్ హౌస్‌లకు చెల్లించాలి. పెరిగిన భూమి ధరలు చెల్లించడం లేదు. రూ.58,000 కోట్ల అంచనా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రాజెక్టు విషయంలో పీపీఏ, సీడబ్ల్యూసీ సహకరించాయి. కేంద్రానికే దయలేదు. జాతీయ ప్రాజెక్టుగా డీపీఆర్‌ను ఆమోదించండి. కాలయాపన చేస్తే జాతి క్షమించదు. మేం ఈ ప్రాజెక్టును ఆపేస్తే ఆదే ఈ ప్రాజెక్టుకు ముగింపు అవుతుంది. 2019 జూన్ నాటికి గ్రావిటీతో నీళ్లిస్తాం. భవిష్యత్తులో ఐదు నదులను అనుసంధానం చేస్తాం. ఎక్కడ కరువుంటే అక్కడకు నీరు పంపొచ్చు. 24 ప్రాజెక్టులు త్వరలోనే జాతికి అంకితమిస్తాం. 2019 జూన్‌లో వర్షాలు పడగానే పోలవరం నుంచి నీళ్లిస్తాం’ అని తెలిపారు.