ఆకాశంలో విహారించాలన్న కర్నూలు జిల్లా ప్రజల దశబ్ధాల కల త్వరలో నెరవేరనుంది. ఇందులో భాగంగా ఓర్వకల్లు మండల పరిధిలోని కనమడకల, పూడిచెర్ల గ్రామ సమీపంలో చేపట్టిన ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి దశకు చేరుకోగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళ వారం ఈ ఎయిర్పోర్ట్ను జాతికి అంకితం చేసారు. గత డిసెంబర్ 31న ఓర్వకల్లు ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలకు సంబంధించి ట్రయిల్ రన్ నిర్వహిం చిన సంగతి విధితమే. మొత్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కాగా, వచ్చే ఏప్రిల్, మే నెలలో ఓర్వకల్లు విమానాశ్రయం పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రాయలసీమలో ఒక్కటైన కర్నూలు జిల్లాలో విమానయాన సేవలు ఎంతో అవసరంగా గుర్తించింది.
ముఖ్యంగా సమీకృత ఆర్థిక వ్యవస్థలో కర్నూలు జిల్లా ఏపీలో రెండవ స్థానంలో ఉండటంతో పాటు వ్యవసాయంలో 36 శాతం, ఉత్పత్తిలో 18 శాతం, సేవారంగంలో 46 శాతం ఆర్థిక అభివృద్ధిని కలిగి ఉండటాన్ని గుర్తించి 2015 అక్టోబర్ 26న ఏపీ ప్రభుత్వం కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో ఐఎన్సిఏపి/పి/ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మొదట ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, విమానాల రాకపోకలకు అవసరమైన వాతవరణం, ఇతర వసతులపై ప్రభుత్వం పూర్తిగా అధ్యయనం చేయించింది. మొత్తంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు ఓర్వకల్లు అన్ని విధాలుగా అనుకూలంగా గుర్తించి కనమడకల, పూడిచెర్ల గ్రామ సమీపంలో సుమారు 583 ఎకరాల భూమి గుర్తించగా, ఇందులో రాతి నిరుపయోగమైన భూమి 183.2 ఎకరాలు, ఖాళీ పొదలు 234.87 ఎకరాలు, వ్యవసాయ భూమి 164.71 ఎకరాలను సేకరించారు.
ఈ భూమిలో ఎయిర్పోర్ట్ ప్రతిపాదిత నిర్మాణంలో ఐ సోలేషన్ వే 4.44 ఎకరాలు, జిఎస్ఐ ఏరియాకు 2.83 ఎకరాలు, ఏప్రాన్కు 6.51 ఎకరాలు, 1.22 ఎకరాలు టాక్సిదారి, ఖాళీ ప్రదేశానికి 443 ఎకరాలను అవసరంగా గుర్తించి దేశీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి సంస్థల్లో ఒక్కటైన బిఐఏసిఎ ల్కు ఈ భూమిని అప్పగించడం గమనార్హం. ఇక దేశంలో పర్యావ రణ సలహాదారుగా ఉన్న గ్రీన్స్ ఇండియా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు వీటి నిర్మాణ బాధ్యత లను అప్పగించడం జరిగింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మొత్తం రూ. 200.49 కోట్లు అవసరంగా గుర్తించగా, మొదటి దశగా రూ.88.01 కోట్లను ఖర్చు చేశారు. నిర్ణీత భూమిలో 2017 సెప్టెంబర్లో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను ప్రారంభించగా, ఇందులో 39 ఎకరాలలో రహదారి, 52.96 ఎకరాలలో పచ్చదనం విస్తీర్ణం, 3.57 ఎకరాలలో పార్కింగ్, 2.13 ఎకరాల్లో టెర్మినల్ బిల్డింగ్, 0.18 సెంట్లలో విటిసి టవర్, 20 సెంట్లలో ఈ ఎస్ఎస్, 10 సెంట్లలో పైర్ స్టేషన్, 21.69 ఎకరాల్లో రన్వే, 3.58 ఎకరాల్లో ఆర్ఇఎస్ఏలను చేపట్టారు. మొత్తంగా నిర్ణీత 18 నెలల్లోనే ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి దశకు చేరుకోవడంతో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీటిని జాతికి అంకితం చేసారు. ఇక ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ విమాన రాకపోకలకై రక్షణశాఖ నుంచి నిరభ్యంతర (ఎన్ఓసి) సర్టిఫికెట్ను పొందాల్సి ఉంది. ఈ సర్టిఫికెట్ ఈ ఏడాది మార్చి, మేలోగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఎన్ఓసి సర్టిఫికెట్ రాగానే ఓర్వకల్లు నుంచి పూర్తిస్థాయిలో దేశంలోని ప్రధాన పట్టణాలకు, మెట్రోపాలిత ప్రాంతాలకు విమాన సర్వీసులు నడిచే అవకాశం ఉంది.