బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం నిర్మాణంలో మరో అరుదైన రికార్డు ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్లో రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసేందుకు చేపట్టిన పనులు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల వరకు ఈ పనులు కొనసాగనున్నాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో దీన్ని నమోదు చేసేందుకు గిన్నిస్ బుక్ ప్రతినిథి విశ్వనాథ్ ఆదివారం పనులను పరిశీలించారు. ఇప్పటి వరకూ దుబాయ్‌లో నమోదైన రికార్డును అధిగమించేందుకు పోలవరం ప్రాజెక్టు పనులలో భాగంగా 24 గంటల్లో 30వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసేందుకు ఏర్పాటు చేసినట్లు నవయుగ ఎండీ బి.శ్రీధర్ చెప్పారు. గిన్నిస్‌బుక్ ప్రతినిధులు 24 మంది ఈ కాంక్రీట్ పనులను పర్యవేక్షిస్తున్నారు.
దుబాయ్‌లో ఒక టవర్ నిర్మాణానికి 2017 మే లో 36 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల(ఘ.మీ.) కాంక్రీట్ వేశారని, ఇప్పుడా రికార్డును అధిగమించేందుకు 24 గంటల్లోనే 30 వేల ఘ.మీ. కాంక్రీట్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా మూణ్నెల్ల కిందట 24 గంటల్లో 11,158 ఘ.మీ. కాంక్రీటు వేశారు. మళ్లీ గత నెలలో 11,289 ఘ.మీ. కాంక్రీట్ పనులు చేసి ఆ రికార్డును అధిగమించారు. ఇప్పుడు ఏకంగా 30వేల ఘ.మీ. కాంక్రీటు వేసేందుకు గుత్తేదారు సంస్థ నవయుగ ఆధ్వర్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రతి 15 నిమిషాలకోసారి గణాంకాలు గిన్నిస్‌బుక్ ప్రతినిధులు నమోదు చేసుకుంటున్నారు. రేపు ఉదయం పనులను సీఎం చంద్రబాబు పరిశీలంచనున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, రాత్రి 8 గంటలకు, 16 వేల ఘ.మీ. కాంక్రీటు వేశారు.
30వేల ఘ.మీ. కాంక్రీట్‌కు కావాల్సినవి.. సిమెంటు : ఏడువేల టన్నులు, ఇసుక : 22వేల టన్నులు, కంకర : 36వేల టన్నులు.. మానవ వనరులు.. కార్మికులు : 3,600 మంది, సాంకేతికేతర సిబ్బంది : 720, సాంకేతిక సిబ్బంది : 500, వివిధ హోదాల్లోని ఇంజినీర్లు : 21 మంది. ప్రస్తుతం ప్రాజెక్టులో గంటకు 3,770 మెట్రిక్ టన్నుల కంకర తయారు చేసే క్రషర్లున్నాయి. సిమెంటు, ఇసుక, ఇతర రసాయన మిశ్రమాలు కలిపే బ్లాచింగ్‌ప్లాంట్లలో గంటకు 1560ఘ.మీ. కాంక్రీట్ కలిపేలా సన్నద్ధం చేశారు. ఆదివారం ఉదయం 8గంటలకు స్పిల్‌ఛానల్‌లో పని ప్రారంభించి సోమవారం ఉదయం 8గంటలకు 30వేల ఘ.మీ. పైబడి కాంక్రీట్ వేసి రికార్డు సాధించాలనుకుంటున్నారు. అదే పనిని మరికొన్ని గంటలపాటు కొనసాగించే ఆలోచనతో ఉన్నారు. రికార్డు సాధించిన అంశంపై లండన్ నుంచి ప్రకటన వచ్చాక ప్రాజెక్టులో సంబరాలు చేసుకునేందుకు నవయుగ సంస్థ ప్రతినిధులు ఏర్పాట్లు చేసుకున్నారు.