బీజేపీ యేతర ఐక్యఫ్రంట్‌పై మరో విడత జాతీయ నేతలతో చర్చలు జరిపేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళుతున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయం ప్రారంభం అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని అటు నుంచి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. గత నెల మొదటి వారంలో జాతీయ నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ నెల రెండో వారంలో మరోసారి ఆయన భేటీ కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, మాయావతి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తదితర నేతలతో ఆయన మలివిడత చర్చలు జరపనున్నారు.
అంతకుముందు ఏపీ భవన్లో టీడీపీ ఎంపీలతో సమావేశమై పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, రాజధానికి నిధుల మంజూరు, రైల్వేజోన్, తదితర అంశాలపై పార్లమెంట్లో ఆందోళన నిర్వహిస్తున్న టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేసిన సంగతి విదితమే. ఈనేపథ్యంలో ఇకముందు జరిగే సమావేశాల్లో ఆందోళన ఉద్ధృతి పెంచే దిశగా కార్యాచరణ రూపొందించనున్నారు. జాతీయ, ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల ఎంపీలను కలుపుకుని రాఫెల్ కుంభకోణంపై మూకుమ్మడి ఆందోళన నిర్వహించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి షాక్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని సమాచారం.
మరో పక్క చంద్రబాబు ఢిల్లీ పర్యటన పై స్పందించారు. అదృష్టం కలిసి వచ్చి మోదీ ప్రధాని అయ్యారని సీఎం చంద్రబాబు విమర్శించారు. నిడదవోలులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా అన్న క్యాంటిన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘రాష్ట్ర పరిధిలో ఉండే కోడి కత్తి కేసుపై ఎన్ఐఏ ఎంక్వైరీ వేశారు. గుజరాత్ అల్లర్ల కేసులో నాడు సీబీఐ విచారణను మోదీ అడ్డుకున్నారు. నాకు ప్రధాని కావాలన్న కోరిక ఏ మాత్రం లేదు. హోదా ఇస్తామన్నందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాం. రేపు మరోసారి ఢిల్లీ వెళ్తా.. ఇతర పార్టీల నేతలను కలుస్తా’’ అని చంద్రబాబు తెలిపారు.