ఈ రాష్ట్రం దేశంలో భాగం కాదా ? ఇలాంటి ప్రశ్న ఎవరన్నా వేస్తే, రాజకీయం కోసం, మరీ ఇలాంటి మాటలు మాట్లాడతారా అంటారు. కాని, ఢిల్లీ పెద్దలు ఇలాంటి పనులు చేస్తుంటే, ఇలాంటి ఆలోచనలు ఏపి ప్రజల్లో రావటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. రోడ్డున పడేసిన రాష్ట్రాన్ని ఆదుకోవటానికి విభజన చట్టం అని ఒకటి పెట్టారు. అందులో ఏది నెరవేర్చలేదు కేంద్రం. ఎందుకు నెరవేర్చలేదు అని ఏపి ప్రజల తరుపున, ఢిల్లీ పెద్దలను డీ కొడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో, ఢిల్లీ పెద్దలు, రాష్ట్రాన్నే ఇబ్బంది పెడుతున్నారు. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా, మమ్మల్నే డీ కొడతారా అని, కసి పెంచుకుని, ఏపికి అన్యాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా, రిపబ్లిక్ డే నాడు, ప్రదర్శించే ఏపి శకటానికి బ్రేక్ వేసారు. కేంద్రం ఈ సారి, గాంధీజీ జీవితంతో సంబంధం ఉన్న ఇతివృత్తాలతో వాటికి రూపకల్పన చేయాలని చెప్పింది.
దీని ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ గాంధీకొండ, పొందూరు ఖద్దరు, పల్లిపాడు సత్యాగ్రహ ఆశ్రమం ఇతివృత్తంతో డ్రాయింగ్స్ తయారు చేసి పంపింది. చివరకు దీన్ని ఎంపిక చేయలేదనడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ఈ విషయాన్ని తొలి నుంచీ చూస్తూ వచ్చిన ఏపీ భవన్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని గాంధీ కొండపై గాంధీ పీస్ ఫౌండేషన్ నిర్మించిన 52 అడుగుల స్తూపం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ ఉద్యమానికి ప్రబల గుర్తింపుగా దాన్ని నిర్మించారు. తిలక్ పీస్ ఫౌండేషన్‌కు కోటి రూపాయలు సమీకరించే లక్ష్యంతో ప్రజలు చరఖాలు కొనుగోలు చేసి స్వదేశీ ఉద్యమంలో పాల్గొనాలని ఈ కొండమీద నుంచే గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే, మహాత్మాగాంధీ పిలుపునందుకొని శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు గ్రామస్థులు స్వదేశీ ఉద్యమ దీక్ష బూని ఖాదీ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. మరో పక్క, అంటరానితనం రూపుమాపే సర్వోదయ ఉద్యమంలో భాగంగా అప్పట్లో గాంధీజీ నెల్లూరు జిల్లా పల్లిపాడుకు విచ్చేశారు. ఆ గ్రామంలో అధికంగా ఉన్న అంటరానితనాన్ని రూపుమాపడానికి సబర్మతి ఆశ్రమం తరహాలో పినాకిని నది ఒడ్డున సత్యాగ్రహ ఆశ్రమం నిర్మించాలని ఆయన స్థానిక నాయకులకు సూచించారు.
గాంధీజీ స్ఫూర్తిని ఇప్పటికీ ముందుకు తీసుకెళ్తున్న ఈ మూడు ఘట్టాలను గణతంత్ర వేదికగా చాటాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇతివృత్తాలను రక్షణశాఖ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఒప్పుకున్నాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్రీడీ నమూనా, ఇతివృత్త సంగీతాన్ని రూపొందించింది. చివరి రౌండ్ వరకూ ఆంధ్రప్రదేశ్ నమూనా పోటీలో ఉంది. అధికారులు అంతా బాగుంది ప్రశంసించారు కూడా. త్వరలో విషయం చెబుతామన్న రక్షణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఎన్నో రాష్ట్రాలు సమర్పించిన నమూనాల కంటే ఆంధ్రప్రదేశ్ నమూనా చాలా అద్భుతంగా వచ్చిందని ఎందుకు ఎంపిక కాలేదో అర్థం కాలేదని ఏపీ భవన్ అధికారులు విచారం వ్యక్తం చేశారు. ఏపీ శకటం పైన కూడా ప్రధాని మోదీ అక్కసు పెట్టుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. రిపబ్లిక్ డేకు ఏపీ శకటం లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో భాజపా కక్ష సాధింపునకు ఇది పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు.