ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతల పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీకి మీరెలా మద్దతిస్తారంటూ బాబు ప్రశ్నించారు. నాగమల్లితోట జంక్షన్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌ను భారతీయ జనతా పార్టీ నేతలు అడ్డుకున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాన్వాయ్‌ను అడ్డుకున్న భాజపా నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాన్వాయ్ ఆపించి, అడ్డు తగిలిన వారిని రమ్మని, అసలు మీకు ఏమి కావలి, ఎందుకు అడ్డుకున్నారు అంటూ నిలదీశారు.
చంద్రబాబు ఇలా చేస్తారని ఊహించని వాళ్ళు అవాక్కయ్యారు. చంద్రబాబు అడిగే ప్రశ్నలకు సమాధానం లేక, డౌన్ డౌన్ అంటూ హడావిడి చేసారు. ఎందుకు డౌన్ డౌన్ చెప్పండి, అంటూ నిలదీశారు. రాష్ట్రానికి మోదీ ఏంచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉండేందుకు భాజపా నేతలకు అర్హత లేదన్నారు. రాష్ట్రానికి మోదీ చేసిన అన్యాయాన్ని మీరు సమర్థిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని, దేశాన్ని మోదీ ముంచేశారని విమర్శించారు. మీరు ఇక్కడ నీరు, గాలి పీల్చుతూ, మన రాష్ట్రం కోసం నిలబడాలని, అంతే కాని ఢిల్లీ అన్యాయానికి నిలబడితే ఎలా అని నిలదీశారు. కాకినాడలో తలపెట్టిన ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
కాకినాడ జేఎన్టీయూలో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమానికి వెళుతున్న సీఎం చంద్రబాబుని బీజేపీ కార్యకర్తలు, నేతలు అడ్డుకున్న విషయం పై మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. బీజేపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. బీజేపీ, భారతీయ జోకర్స్ పార్టీగా మారిందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ కి నీరు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్న మోదీ ఇంటి ముందు ధర్నా చేసే దమ్మూ, ధైర్యం లేని బీజేపీ నాయకులు ముఖ్యమంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటని, ఆంధ్రాలో బీజేపీని ప్రజలు మట్టిలో కలిపేసే రోజులు దగ్గర పడ్డాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉపాధిహామీ పథకం నిధులు గురించీ లోకేశ్ ప్రస్తావించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు ఉపాధిహామీ పథకం ద్వారా అధిక నిధులు రావడం చట్టం ద్వారా వచ్చిన హక్కు అని అన్నారు.