ఈ రోజు ఢిల్లీ వేదికగా ఆంధ్రా వారికి, రెండు అవమానాలు జరిగాయి. రెండూ మన హక్కులు అడిగినందుకు. ఇచ్చిన హామీలు, చట్టంలో ఉన్నవి అమలుపరచండి అని అడిగినందుకు, మోడీ ఇచ్చిన బహుమతి ఇది. సభ లోపల ఒకలా, సభ బయట ఒకలా అవమానించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి పార్లమెంట్ ముట్టడికి యత్నించింది. ప్రత్యేకహోదా, రైల్వేజోన్ తదితర డిమాండ్లతో ముట్టడికి బయలుదేరిన ప్రత్యేక హోదా సాధన సమితి నేతలను దిల్లీ పోలీసులు అడ్డుకుని వారిపై లాఠీ ఛార్జి చేశారు. ప్రత్యేక హోదా సాధన సమితి నేతృత్వంలో వామపక్షాలు, విద్యార్థి సంఘాలు దిల్లీలో గత రెండ్రోజులపాటు నిరసనలు చేపట్టాయి. వీరి ఆందోళనలకు తెదేపా ఎంపీలు మద్దతు తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయా సంఘాలు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగాయి. బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రత్యేక సాధన సమితి, ప్రజా విద్యార్థి సంఘాల కార్యకర్తలు, నేతలు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో పలువురు కిందపడిపోయారు. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రత్యేక హోదా సాధనా సమితి నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా వారు పీఎస్‌లో ఆందోళన కొనసాగించారు. ప్రత్యేక హోదా సాధన సమితి నేతలకు టీడీపీ ఎంపీలు సంఘీభావం తెలిపారు. పోలీసుల లాఠీ చార్జ్‌లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని టీడీసీ నేతలు పరామర్శించారు.
ఇక మరో పక్క, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ఆందోళనకు దిగిన టీడీపీ లోక్ సభ సభ్యులకు స్పీకర్ సుమిత్రా మహాజన్ షాకిచ్చారు. ఆందోళన విమరించి వెళ్లి తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని లేదంటే సస్పెండ్ చేస్తా అని హెచ్చరించారు. మా హక్కుల పై మాట్లడేదాకా మేము ఆందోళన విరమించం అని చెప్పటంతో, 12 మంది టీడీపీ సభ్యులను నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ ఈరోజు ఆదేశాలు జారీచేశారు. సస్పెన్షన్ నేపథ్యంలో సభ నుంచి బయటకు వెళ్లాలని కోరగా అందుకు టీడీపీ నేతలు నిరాకరించారు. లోక్ సభలోనే తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ విధంగా, కేవలం మన హక్కులు అడిగినందుకు, ఢిల్లీలో ఆంధ్రా వాడికి జరిగిన అన్యాయం ఇది.