చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరులో ఆదివారం జరిగిన జనసేన సభ రసాభాసగా మారింది. వైసీపీ శ్రేణులు చొచ్చుకు వచ్చి ‘జై జగన్’ అంటూ నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. రెండు పార్టీల కార్యకర్తల వాగ్వాదం, తోపులాటలు, కుర్చీలు విసురుకోవడం వంటి ఘటనలతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో.. హైపర్ ఆది పాల్గొన్న ఈ సభ అర్ధంతరంగా ముగిసింది. హైపర్ ఆది సభా వేదికపైకి రాకముందు కొందరు స్థానిక నేతలు ప్రసంగిస్తూ వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు చేశారు. దీనికి నిరసనగా వైసీపీ కార్యకర్తలు ‘జై జగన్’ అంటూ నినదించారు. అదే సమయంలో సభ వద్దకు హైపర్ ఆది రావడంతో ఆయన కారు అద్దాలపై వైసీపీ కార్యకర్తలు కొట్టారు.
దీంతో జనసేన కార్యకర్తలు వలయంగా ఏర్పడి సభావేదికపైకి ఆదిని తీసుకెళ్లారు. వైసీపీ శ్రేణుల నినాదాల మధ్యే హైపర్ ఆది ప్రసంగం మొదలుపెట్టారు. ఎన్నికలు జరిగే ఈ నాలుగు నెలలు జనసేనపై దాడులు చేసి గందరగోళం సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తుంటారని, జాగ్రత్తగా ఉండాలని ఆది సూచించారు. కులపిచ్చితో కొందరు ఓట్లు వేస్తున్నారని, కానీ పవన్‌లాంటి నిస్వార్థ నేతను ఎన్నుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పవన్ కల్యాణ్‌కు డబ్బు, పదవి పిచ్చిలేదని, కేవలం ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆది ప్రసంగానికి వైసీపీ కార్యకర్తలు అడ్డుతగులుతూ ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ వేదిక వరకూ వచ్చారు.
దీంతో ఆది తన ప్రసంగాన్ని ముగించేశారు. ఆది, మరికొందరు జనసేన నేతలను మరో మార్గం నుంచి పోలీసులు తిరుపతికి పంపారు. కాగా, ఇద్దరు పోలీసులు మాత్రమే బందోబస్తుకు రావడంతో ఆందోళనకారులను అదుపు చేయలేకపోయారు. ఈ సభకు హాజరైన కొందరు స్థానిక నేతల కథనం ప్రకారం, వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు చేయడంతో గొడవ ప్రారంభమైంది. వారిని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో హైపర్ ఆది, తన కారులో రావడంతో కారుపై దాడికి యత్నించారు. విషయం తెలుసుకుని వచ్చిన పోలీసులు ఆదిని మరో మార్గం గుండా తిరుపతి రహదారిపైకి చేర్చారు.