మీకు వేల కోట్లు ఇచ్చాం, లక్షల లక్షల కోట్లు ఇచ్చాం అంటూ డబ్బా కొట్టటానికి, వారినికి ఒక కేంద్రం మంత్రిని ఏపికి తీసుకువస్తాం అని జీవీఎల్ చెప్పాడో లేదో, ఈ రోజు నితిన్ గడ్కరీ విజయవాడలో వాలిపోయారు. చంద్రబాబు ప్రభుత్వం పై విమర్శలు ఎక్కు పెట్టి, మా మోడీ అంతా చేసేసారు అని చెప్పే టైంలోనే, చంద్రబాబు వీళ్ళ నిజ స్వరూపం బయట పెడుతూ, గడ్కరీకి ఘాటు లేఖ రాసారు. నితిన్ గడ్కరీకి పోలవరం నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు లేఖరాశారు. పోలవరానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.3,722 కోట్లు తక్షణం విడుదల చేయాలని కోరారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.10,459 కోట్లు ఖర్చు చేయగా కేవలం రూ.6,727 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు.
గత జులైలో పోలవరంలో కేంద్రమంత్రి గడ్కరీ పర్యటించినప్పుడు ఫిబ్రవరిలోపు నిధులు మొత్తం విడుదల చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఈ విషయంలో ఎంతవరకు మాట మీద నిలబడ్డారో చెప్పాలని ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్ట్ను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఇస్తామన్న హమీని తక్షణమే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. కేంద్రం సహకరించకపోయినా ఇప్పటి వరకు 64 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం ఇచ్చిన నిధులు, పోలవరం ప్రాజెక్టుకు ఇస్తామన్న హామీకి సంబంధించి నిధులు విడుదల చెయ్యాలని లేఖలో కోరారు.
మరో పక్క విజయవాడలో, గడ్కరీ చంద్రబాబు పై విమర్శలు చేసారు. విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన కృష్ణా జిల్లా, విజయవాడ నగర భాజపా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. భాజపా ఏ మతానికీ వ్యతిరేకం కాదని.. తీవ్రవాదానికి మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు, అమలు చేస్తున్న పథకాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పోలవరం పనులు 62 శాతం పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం విషయంలో కేంద్రం ఘనతను రాష్ట్రం ఎందుకు ఒప్పుకోవడం లేదో తెలియడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇస్తున్నా వాటిని దుర్వినియోగం చేసి రూపాయి కూడా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.