ఎరక్కపోయి ఇరుక్కున్నట్టుగా తయారైంది ఏపీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి! నిన్నటిదాకా ఆ పార్టీలో ఉన్న ఆశలు క్రమంగా అడుగంటుతున్నాయి. అంచనాలు, లెక్కలు తారుమరవుతున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలలో, శ్రేణులలో ఆందోళన మొదలైంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సెంటిమెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ 2014లో అధికారానికి అడుగుదూరంలో నిలిచిపోయింది వైసీపీ. ఈసారి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉందనీ, అదే తమకు కలిసివస్తుందనీ ఆ పార్టీ పెద్దలు నిన్నమొన్నటి వరకు ధీమాగా ఉన్నారు. అయితే నాలుగు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు వైసీపీ నాయకులకు మింగుడుపడటం లేదు.
జాతీయస్థాయిలో కాంగ్రెస్‌తో తెలుగుదేశంపార్టీ జతకట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరికొన్ని మార్పులు సంభవించాయి. దీంతో వైసీపీ ఎటూ తేల్చుకోని పరిస్థితిలో చిక్కుకుంది. కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చీరాగానే.. 10 టెన్ జన్‌పథ్‌కీ, పులివెందుల పౌరుషానికీ పోటీ అంటూ సవాళ్లు విసిరారు జగన్. దీంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరిగిపోయింది. పైగా వైసీపీలో ఉన్న నేతల్లో 90 శాతం వరకు కాంగ్రెస్ నుంచి వచ్చినవారే. మరోవైపు బీజేపీతో చేతులు కలిపితే ప్రజలు హర్షించే స్థితిలో లేరు. బీజేపీ సారథ్యంలోని కేంద్రం తమను నమ్మించి మోసం చేసిందనే భావనలో ఏపీ ప్రజలున్నారు. అసలు జగన్‌ను నడిపిస్తున్నదే బీజేపీ అనీ, కేసుల నుంచి బయటపడేందుకే ఆయన బీజేపీకి సరెండర్ అయ్యారనే విమర్శలూ ఉన్నాయి. బీజేపీతో ఎలాంటి బంధం లేదని వైసీపీ పెద్దలు పదేపదే వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది.
అటు వామపక్ష పార్టీలేమో జనసేనతో కలిసి ముందుకెళ్తున్నాయి. ప్రజాపోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నాయి. బీజేపీయేతర కూటమిలోకి రావాలని సీపీఐ, సీపీఎం నేతలతోనూ చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారు. అంటే కమ్యూనిస్టులు వైసీపీతో కలిసి రానట్టే! మరోవైపు జగన్, పవన్‌ను కలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే వార్తలను జనసైనికులు అంగీకరించడం లేదు. అసలు ఆ పార్టీ శ్రేణులు వైసీపీతో కలిసేందుకు సుముఖంగా లేవు. అయినా, ఇప్పుడు వైసీపీకి ఇది ఒక్కటే ఆప్షన్ గా కనిపిస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టినా, జగన్ కాని వైసీపీ కాని, తిరిగి ఏమి అనటం లేదు. విడి విడిగా వెళ్తే, పవన్ కు పోయేది ఏమి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక 5 సీట్లు గెలిస్తేనే ఎక్కువ అనుకునే పరిస్థితి ఉంది. కాని జగన పరిస్థితి అలా కాదు, ప్రతిపక్షాల ఓట్లు చీలి పొతే, అది జగన కు పెద్ద మైనస్ అవుతుంది. అందుకే ఇప్పుడు జగన్ కు, పవన్ తో వెళ్తేనే ఉపయోగం. అటు బీజేపీ కూడా ఇదే కోరుకుంటుంది.