ఎన్నికలు పూర్తయిన ఛత్తీస్గఢ్లో ఈవీఎంల భద్రతపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. కొందరు అనధికార వ్యక్తులు... సీసీటీవీ కెమెరాలకు మరమ్మతుల పేరుతో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల్లోకి ప్రవేశించి, అక్కడే ఉంటున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్లోని స్ట్రాంగ్ రూంలోనూ గంటన్నరపాటు విద్యుత్ సరఫరాను, సీసీటీవీలను నిలిపివేశారని ఆరోపించింది. ఈ పరిణామాలు అనుమానాలకు తావిస్తున్నందున ఈవీఎంల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు అభిషేక్ మను సింఘ్వీ, మనీశ్ తివారీ, పీఎల్ పునియా, వివేక్ ఠంకా, టీఎస్ సింగ్ దేవ్ల బృందం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.
అనంతరం పునియా విలేకరులతో మాట్లాడుతూ... ఛత్తీస్గఢ్ విషయమై తాము ఫిర్యాదుల కంటే సూచనలే ఎక్కువ చేశామన్నారు. అక్కడ సీసీటీవీ కెమెరాలకు మరమ్మతుల పేరుతో కొందరు వ్యక్తులు స్ట్రాంగ్ రూముల్లోకి వచ్చి ఉంటున్నారని ఆరోపించారు. ఇలాంటి వారి విషయంలో నియంత్రణ విధించాలని కోరినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూముల నుంచి లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలించేటప్పుడు గందరగోళం జరిగే ప్రమాదముందని, దానిపైనా దృష్టి సారించాలని సూచించినట్లు పునియా వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని రౌండ్లను ఒకేసారి చేపట్టకుండా... ఒకదాని తర్వాత ఒకటిగా లెక్కించి, ప్రతి రౌండ్ లెక్కలను అభ్యర్థులకు చెప్పిన తర్వాతే ముందుకెళ్లాలని కోరామన్నారు. ఆయా కేంద్రాల్లోకి జిల్లా కలెక్టర్లు ఫోన్లు తీసుకొని వెళ్లకుండా నిర్దేశించాలని అడిగామన్నారు.
అయితే భోపాల్ కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్లో శనివారం దాదాపు గంటన్నర పాటు సీసీకెమెరాలు, ఎల్ఈడీ తెరలు పనిచేయలేదు. దీంతో ఆందోళన చెందిన కాంగ్రెస్, ఆప్ పార్టీ నేతలు.. దీనిపై విచారణ జరిపించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిపై విచారణ జరిపిన ఈసీ.. కలెక్టరేట్ పరిధిలో శనివారం ఉదయం గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్లే సీసీ కెమెరాలు పనిచేయలేదని తేల్చింది. అయితే భోపాల్లోని పాత జైలులోని స్ట్రాంగ్ రూమ్ గదికి తాళం వేయలేదంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదును స్వీకరించిన ఈసీ దీనిపై విచారణ జరిపించింది. ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్ గది మూసేసి తాళం వేసి ఉందని ఈసీ వెల్లడించింది. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈవీఎంలకు భద్రత కరవైందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.