బీజేపీ నాయకత్వానికి వెన్నులో చలిపుట్టించే విధంగా ఒక సీనియర్ పోలీసు అధికారి బాంబు పేల్చారు. గ్యాంగ్‌స్టర్ సొహ్రాబుద్దీన్ షేఖ్, తులసీరాం ప్రజాపతి ఎన్‌కౌంటర్లలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రధాన కుట్రదారుడని ఈ కేసులో దర్యాప్తు జరిపిన ముఖ్య దర్యాప్తు అధికారి(సీఐవో) సందీప్ తమ్‌గడే కోర్టుకు సాక్ష్యమిచ్చారు. షాతోపాటు మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా ప్రధాన కుట్రదారులని ఆయన పేర్కొన్నారు. సందీప్ తమ్‌గడే బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే ఈ కేసుపై తాను కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని ఆయన చెప్పారు.
‘‘మేము చేసిన దర్యాప్తు ప్రకారం అమిత్‌షా, గుజరాత్ మాజీ డీఐజీ డీజీ వంజరా, ఇంటెలిజెన్స్ ఎస్పీ రాజ్‌కుమార్ పాండ్యన్, రాజస్థాన్ ఐపీఎస్ అధికారి ఎంఎన్ దినేశ్‌లు ప్రధాన కుట్రదారులుగా తేలారు’’ అని సందీప్ తమ్‌గడే కోర్టుకు తెలిపారు. ఈ నలుగురినీ ట్రయల్‌కోర్టు ఇప్పటికే నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటులో అమిత్‌షా, ఇతరులపై ఎలాంటి ఆధారాలు లేవని కూడా ఆయన అంగీకరించారు. అప్పట్లో సీబీఐ ఎస్పీగా ఉన్న సందీప్... సొహ్రాబుద్దీన్ కేసులో అనుబంధ చార్జిషీటును, తులసీరాం కేసులో ప్రధాన చార్జిషీటును తయారు చేశారు. ఈ రెండు కేసులను కలిపి ఇక్కడ సీబీఐ ప్రత్యేక జడ్జి ఎస్‌జే శర్మ విచారిస్తున్నారు. అమిత్‌షా గుజరాత్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక బిల్డర్ కార్యాలయం వద్ద కాల్పులు జరిపేందుకు సొహ్రాబుద్దీన్, ప్రజాపతిలను ఉపయోగించుకున్నట్లుగా తన వద్ద బలమైన ఆధారాలు ఉన్నట్లు డిఫెన్సు లాయర్ అడిగిన ప్రశ్నకు తమ్‌గడే చెప్పారు.
సోహ్రాబుద్దీన్ ఫేక్ ఎన్‌కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని నిర్దోషిగా బయటపడిన డీజీ వంజారాకు మోదీ సన్నిహితుడుగా పేరుంది. మోదీని తన ఆరాధ్య దైవంగా వంజారా భావించేవారు. అలాంటి వ్యక్తి.. 2013లో రాజీనామా చేస్తూ మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. నకిలీ ఎన్‌కౌంటర్ల కేసులో తనతో సహా 32 మంది అధికారులను మోసం చేశారని ఆక్రోశం వెళ్లగక్కారు. ‘‘పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై పోరాడిన పోలీసు అధికారులను కాపాడటంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది’’ అని విమర్శించారు. ‘‘నరేంద్ర మోదీని నేను దైవంగా భావించేవాడిని. కానీ, అమిత్ షా దుష్ప్రభావం ఆయన మీదా పడింది. మా విషయంలో తగిన విధంగా స్పందించలేకపోయారు. ఎన్‌కౌంటర్లకు మోదీ ప్రభుత్వానిదే బాధ్యత. ప్రభుత్వం ఆచితూచి ఎంచుకున్న విధానాన్నే వివిధ విభాగాల అధికారులు అమలు చేసినట్లు విస్పష్టంగా చెప్పగలను. ప్రభుత్వంలో ఉన్నవారు తీసుకున్న నిర్ణయాలనే క్షేత్రస్థాయి సిబ్బందిగా, అధికారులుగా మేం అమలు చేశాం. మేం చేసింది నకిలీ ఎన్‌కౌంటర్లయితే అప్పట్లో ఉగ్రవాద నియంత్రణకు సంబంధించిన విధానాలను రూపొందించిన వారినీ అరెస్టు చేయాలి. ఈ ప్రభుత్వం ఉండాల్సింది గాంధీనగర్‌లో కాదు. ముంబైలోని తలోజా కేంద్ర కారాగారంలోనో.. అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైల్లోనో’’ అని 2013 సెప్టెంబరు 1న గుజరాత్ హోం శాఖ కార్యదర్శికి పంపిన 10 పేజీల సుదీర్ఘమైన లేఖలో పేర్కొన్నారు.