దేశంలో లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా అవి అధికార భాజపాకు పంటి కింద రాయిలా తయారవుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి అధికార పగ్గాలు చేపట్టిన భాజపా... ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్కొక్కటిగా స్థానాలు కోల్పోతూ వస్తోంది. గత నాలుగున్నరేళ్లలో 30 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప సమరంలో అధికార పక్షం కేవలం ఆరు సీట్లను నిలబెట్టుకొంది. 9 సొంత సీట్లను ప్రత్యర్థులకు కోల్పోయింది. ఈ మొత్తం క్రతువులో వైరి పక్షానికి చెందిన ఒక్కసీటును కూడా భాజపా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. దీంతో గత ఎన్నికల నాటి భాజపా బలం 282 కాస్తా ఇప్పుడు 273కి తగ్గిపోయింది. ఉప ఎన్నికల్లో భాజపా గెలిచిన చోట్ల ఆ పార్టీ అభ్యర్థుల మెజార్టీ బాగా తగ్గిపోయింది.
2014 ఎన్నికలు పూర్తయిన వెంటనే వడోదర స్థానానికి ప్రధానమంత్రి రాజీనామా చేయడం, మహారాష్ట్రలోని బీడ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన గోపీనాథ్ ముండే ఆకస్మికంగా మరణించడంతో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ రెండు స్థానాల్లో భాజపా 70 శాతానికి పైగా ఓట్లు కొల్లగొట్టింది. కాలం గడిచే కొద్దీ సీట్లతో పాటు ఓట్లనూ కోల్పోతూ వస్తోంది. తాజాగా శివమొగ్గ లోక్‌సభ స్థానం నుంచి 2014లో యడ్యూరప్ప 3.63 లక్షల మెజార్టీతో గెలుపొందగా, ఇప్పుడు ఆయన తనయుడు బీఎస్ రాఘవేంద్ర మెజార్టీ 47వేలకు తగ్గిపోయింది. 2014లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన ప్రతి స్థానాన్నీ ఉప ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు నిలబెట్టుకున్నాయి. భాజపా కోల్పోయిన 9 సీట్లలో అయిదు కాంగ్రెస్ పార్టీకి, రెండు ఎస్పీకి, ఒకటి ఎన్సీపీకి, ఒకటి ఆర్ఎల్డీకి చిక్కాయి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్, ఫూల్పుర్ స్థానాలను భాజపా కోల్పోవడం సంచలనం రేపింది. ఆ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు కలిసి పనిచేయడం దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక శక్తుల ఏకీకరణకు ప్రాణం పోసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైరానా ఉప ఎన్నిక ఫలితం దీనిని మరింత ముందుకు తీసుకెళ్లింది. జాట్ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన సీనియర్ నేత హుకుంసింగ్ మరణంతో ఖాళీ అయిన ఆ స్థానం నుంచి ఆయన కూతురు పోటీపడినా మిత్రపక్షాల ఐక్యత ముందు సానుభూతి పవనాలు పని చేయలేదు.