ఉల్లిపాలెం - భవానీపురం వంతెన ప్రారంభంతో దివిసీమ వాసుల కల నెరవేరింది. తూర్పు కృష్ణావాసుల చిరకాల స్వప్నం కూడా నెరవేరబోతోంది. వచ్చే నెలలో బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బుధవారం కోడూరు మండలం ఉల్లిపాలెంలో కృష్ణానదిపై నిర్మించిన వంతెనను ప్రారంభించిన అనంతరం సీఎం ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రజల ఆశలకు అనుగుణంగా బందరు పోర్టును నిర్మిస్తామని, ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం చల్లపల్లిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, బహిరంగ సభలో ప్రసంగించారు.
బందరు పోర్టు వస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, వలసలు తగ్గుతాయని హితవు పలికారు. పోర్టు నిర్మాణం ద్వారా తీర ప్రాంతాలను ఇండస్ట్రియల్ కారిడార్‌గా తీర్చిదిద్దుతామని, పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. మచిలీపట్నం, దివిసీమ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి అద్భుతమైన వనరులు ఉన్నాయని చెప్పారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుందని సీఎం తెలిపారు. ఇప్పటికే విజయవాడ-మచిలీపట్నం నాలుగు రహదారుల నిర్మాణం పూర్తవుతోందని పేర్కొన్నారు. ఉల్లిపాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణం వల్ల మచిలీపట్నానికి 30 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు.
తీరప్రాంతమైన దివిసీమ ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోకుండా.. ఉండేందుకు పలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ముఖ్యమంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు. లింగాలకోడు, ఇరాలి, రత్నకోడు మురుగుకాల్వపై చెక్‌డ్యాంలను మంజూరు చేశారు అలాగే గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని 24 గంటల ఆసుపత్రిగా మారుస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఏటిమొగ-ఎదురుమొండి గ్రామాల మధ్య వంతెన నిర్మాణంతో పాటు భీమనదిపై ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేశారు. దీంతో పాటు.. పెదగుడుమోటు, చినగుడుమోటు గ్రామాల్లోని మైనార్టీల ప్రార్థనా మందిరాల కోసం రూ.14 లక్షలు, నాగాయలంక మండలం టి.కొత్తపాలెం, మోపిదేవి మండలం బోడగుంట గ్రామాల్లోని చర్చిల నిర్మాణాలకోసం ఒక్కోదానికి రూ.కోటి చొప్పున, చల్లపల్లిలో మసీదు రూ.10 లక్షలు చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.