ప్రజాకూటమి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో బుధవారం భారీ బహిరంగసభ జరుగుతోంది. ఈ సభకు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాంగ్రెస్, టీడీపీ రాజకీయ చరిత్రలో రాహుల్ గాంధీ, చంద్రబాబు కలిసి తొలిసారి ఒకే వేదికను పంచుకోనుండడంతో సభకు ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు తెలంగాణలో పాల్గొంటున్న తొలి బహిరంగ సభ కూడా ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీని డీ కొనటానికి, చంద్రబాబు చేసిన మొదటి ప్రయోగం ఇది. ఆంధ్రర్పదేశ్ రాష్ట్రాన్ని మోడీ నమ్మించి మోసం చేసి, చివరకు రాష్ట్రంలో కుట్రలు చేసి, ప్రభుత్వాన్ని అస్తిరపరిచే ప్రయత్నం చేస్తూ ఉండటంతో, దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలని కలిపి, మోడీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేసిన చంద్రబాబు, మొదటి సారి ఆ ఫ్రంట్ తరుపున బహిరంగ సభలో పాల్గున్నారు.
ఇద్దరు నేతలు ఒకేసారి సభాప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం కలిసే వేదికపైకి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలకు మహాకూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, గద్దర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితోపాటు టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామ నాగేశ్వరరావు, ఏఐసీసీ ప్రతినిధులు కుంతియా, సలీం అహ్మద్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పాల్గున్నారు.
కాంగ్రెస్‌తో కలసి మహాకూటమి ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించిన చంద్రబాబుపై ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కారాలు మిరియాలు నూరుతున్నారు. ఎన్నికల ప్రచారానికి బాబు వస్తే ప్రతిఘటించాల్సిందిగా టీఆర్ఎస్ కార్యకర్తలకు నిర్దేశించిన నేపథ్యంలో బాబు ఎన్నికల ప్రచారానికి సమాయత్తం కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా కేసీఆర్ నాయకత్వం పట్ల విసుగెత్తిన పలువురు నేతలు ఇప్పటికే అమరావతి వేదికగా టీడీపీలో చేరుతున్నారు. తెలంగాణలో ఎన్నికల వ్యూహాన్ని ఇప్పటికే చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో దివంగత రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి టిక్కెట్టు ఇవ్వటంతో ఆ నియోజకవర్గంలో సానుభూతి వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా పలువురు నేతలు టీడీపీ గూటికి చేరుతున్నారు. ఇక కూటమి పొత్తుతో పార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో సైతం టీఆర్ఎస్ను ఢీకొట్టేందుకు అమరావతిలోనే కార్యాచరణ రూపొందించారు.