విభజన జరిగినా జరగకపోయినా.. తెలుగుజాతి కలిసుండాలనేదే తాను ఆకాంక్షించానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఖమ్మంలో జరిగిన ప్రజాకూటమి సభలో ఆయన మాట్లాడారు. దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్‌గాంధీ కూడా హాజరయ్యారు. సమైక్య రాష్ట్రంలో అందరూ రెండుగా విడిపోయినా .. తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలని తాను ఒకే మాటపై ఉన్నానన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాను మోదీ నెరవేర్చలేదన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన విశ్వవిద్యాలయాల గురించి మోదీని టీఆర్ఎస్ అడగడం లేదన్నారు. తానేదో పెత్తనం చేస్తానని బూచిగా చూపిస్తున్నారని ఎద్దేవాచేశారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం అండగా ఉంటానన్నారు. తాను ఇక్కడకు వచ్చి పోటీ చేసే పరిస్థితి లేనప్పుడు పెత్తనం ఎలా చేస్తానని చంద్రబాబు ప్రశ్నించారు.
దేశంలో రెండే రెండు ఫ్రంట్లు ఉన్నాయని.. ఒకటి ఎన్డీయే ఫ్రంట్, రెండోది ఎన్డీయే వ్యతిరేక ఫ్రంట్ అని, ఎవరు ఎటువైపు ఉన్నారో తేల్చుకోవాల్సిన సమయం ఆసననమైందని, కేసీఆర్ ఎక్కడుంటారో చెప్పాలని, ఎంఐఎం ఎక్కడుంటుందో తెలపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈవీఎంలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఓటు ఎవరికి వేసింది వచ్చిన స్లిప్పుతో చూసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలను హ్యాక్ చేయడం చాలా తేలికని, అందుకే జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నానని ఆయన అన్నారు. టెక్నాలజీనీ అధికంగా వాడే వ్యక్తిగా లోటుపాట్లు తనకు తెలుసునని చంద్రబాబు పేర్కొన్నారు.
నూటికి నూరుశాతం కాదు... తెలంగాణలో 1000 శాతం ప్రజాకూటమిదే గెలుపని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ధైర్యంగా పోరాడుదామని, భయపడితే జీవితాంతం నష్టపోతామని ఆయన అన్నారు. తెలంగాణ యువతకు ప్రోత్సహిస్తే... ప్రపంచాన్నే శాసించే శక్తి ఉందని, ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుంటే... తెలంగాణ నెంబర్‌వన్ రాష్ట్రంగా ఉంటుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో ఏం అభివృద్ధి జరగలేదని, అప్పులు పెరిగిపోయాయని విమర్శించారు. బీజేపీకి ఓట్లు లేవు కానీ... హెలికాప్టర్లు ఉన్నాయని, బీజేపీ నేతలు డబ్బు సంచులతో తిరుగుతున్నారని బాబు విమర్శించారు.