వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో జరిగిన దాడిపై హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయి. ఇందులో వెరైటీ ఏంటి అంటే, ఈ కేసు విచారణ ఏకంగా, ఎన్ఐఏ చెయ్యాలి అని. జగన్ పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో విచారణ జరిపించాలని, కేసును ఏపీ పోలీస్ పరిధి నుంచి ఎన్ఐఏకు బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. జగన్‌పై జరిగిన దాడికి అన్‌లాఫుల్ ఎగినెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్3(ఏ) కింద కేసు నమోదు చేయాలని, కానీ పోలీసులు కావాలనే కేసును తప్పుదోవ పట్టించేందుకు సెక్షన్ 307 కింద నమోదు చేశారని పిటిషనర్ ఆరోపించారు.
జగన్‌పై జరిగిన దాడి వెనుక కుట్ర కోణం దాగి ఉందని, ఎన్ఐఏ యాక్ట్‌లోని సెక్షన్ 6 ప్రకారం ఎయిర్‌పోర్ట్ లేదా ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఏదైనా ఘటన జరిగితే విచారణ ఎన్ఐఏ పరిధిలోకి వస్తుందనే విషయం పోలీసులకు తెలిసి కూడా తెలియనట్టు వ్యవహరించారని, 166 ప్రకారం వాళ్లు కూడా శిక్షార్హులేనని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్కే పిటీషన్‌ను నిశితంగా పరిశీలించిన హైకోర్టు ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది. గతంలో దాఖలైన పిటీషన్‌లో ఇంతవరకు అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదంటూ సీఐఎస్ఎఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. సోమవారం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే ఈ కోడి కత్తి దాడి కేసు కోసం, ఏకంగా ఎన్ఐఏతో విచారణ జరిపించాలి అనటం చూసి, ప్రజలు అవాక్కవుతున్నారు. ఇక మిగిలింది ఎఫ్బీఐ అని, దానికి కూడా పిటీషన్ పెడతారేమో అంటున్నారు.
మరో పక్క జగన్ చొక్కాను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపవద్దు అంటూ మరో పిటీషన్ దాఖులు అయ్యింది. కోర్టుకు సమర్పించిన జగన్ చొక్కను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపవద్దని జగన్ తరపున న్యాయవాది నీలాపు కాళీదాసురెడ్డి కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పెండింగ్‌లో ఉన్నందున అది తేలేవరకు వేచివుండాలని కోరారు. సిట్ ఈ చొక్కాను ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించాలని కోర్టును కోరుతూ సిట్ పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై జగన్ తరపున న్యాయవాది కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.