మన దేశంలో టీవీ ప్రకటన ద్వారా ప్రచారం చేయడంలో నెంబర్ వన్ ఎవరు? మనం చూసే అబ్బాస్ హార్పిక్ క్లీనర్ ప్రకటన కాని, సంతూర్ సబ్బు కాని కాదు. ఒక రాజకీయ పార్టీ టీవీ ప్రకటనల్లో అగ్రభాగాన నిలిచింది. నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో బీజేపీ టీవీ ప్రకటనల జోరు పెరిగింది. ప్రచార ప్రకటనల్లో బడా బడా కంపెనీలనే వెనక్కి నెట్టేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీవీ ప్రకటనల్లో టాప్ 10 బ్రాండ్లలో ప్రముఖ విపక్ష పార్టీ కాంగ్రెస్ లేదు. ఈ విషయాన్ని బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్ (బార్క్) తన రిపోర్ట్ లో తెలిపింది. బార్క్ కొత్త రిపోర్ట్ ప్రకారం నవంబర్ 16కి ముగిసిన వారంలో విమల్ పాన్ మసాలా బాగా వెనుకబడి పోయింది.
ఎకనామిక్ టైమ్స్ లో ప్రచురించిన వార్త మేరకు నవంబర్ 10 -16 వారంలో టీవీలో ప్రసారమైన ప్రకటనల్లో బ్రాండ్ బీజేపీ కంపెనీల కంటే ఎక్కువగా కనిపించింది. ఆ తర్వాత స్థానాల్లో నెట్ ఫ్లిక్స్, ట్రివాగో ఉన్నాయి. ఈ వారం టీవీలో మొత్తం 22,099 సార్లు బీజేపీ ప్రకటనలు దర్శనమిచ్చాయి. ఆ తర్వాత 12,951 సార్లు నెట్ ఫ్లిక్స్ యాడ్ కనిపించింది. 12,795 యాడ్స్ తో ట్రివాగో మూడో స్థానంలో నిలిచింది. టీవీలో యాడ్ ఇచ్చే విషయంలో దేశంలోని మిగతా పార్టీల కంటే బీజేపీ ఎంత ముందు ఉందో ఈ అంకెలే చెబుతాయి.
నెంబర్ 2గా ఉన్న నెట్ ఫ్లిక్స్ కి బీజేపీకి మధ్య 9,000 తేడా ఉంది. ప్రకటనల విషయంలో సంతూర్ సబ్బు 11,222 సార్లు కనిపించి నాలుగో స్థానంలో ఉంది. గత వారం టీవీ ప్రకటనల్లో రెండో స్థానంలో ఉన్న బీజేపీ ఈ వారం అమాంతంగా భారీ తేడాతో మొదటి స్థానం సాధించింది. టాప్ 10లోని మిగతా ప్రకటనకర్తల విషయం చెప్పాలంటే డెట్టాల్ (9,487) 5వ స్థానం, వైప్ (9,082) 6వ స్థానం, కోల్గేట్ డెంటల్ క్రీమ్ (8,938) 7వ స్థానం, డెట్టాల్ టాయిలెట్ సోప్ (8,633) 8వ స్థానం, అమెజాన్ ప్రైమ్ వీడియో (8,031) 9వ స్థానం, రూప్ మంత్ర ఆయూర్ ఫేస్ క్రీమ్ (7,962) 10వ స్థానంలో ఉన్నాయి.