ఆంధ్రప్రదేశ్ లో, ప్రతి నెల ఎదో ఒక కార్యక్రమం పెడుతూ, ప్రతి రోజు ఎమ్మెల్యేలు ప్రజలు మధ్య ఉండేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రామా దర్శిని, నగర దర్శిని, ఇంటింటికీ తెలుగుదేశం, ఇలా ఎదో ఒక కార్యక్రమంతో, ఎమ్మెల్యేలు ప్రజలు చుట్టూ తిరిగి, వాళ్ళ సమస్యలు పరిష్కరించేలా చంద్రబాబు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వీటి పై ప్రతి రోజు సమీక్ష జరుపుతూ, సరిగ్గా పని చెయ్యని ఎమ్మెల్యేలను మందలించే వారు. అయితే చంద్రబాబు మమ్మల్ని మరీ ఇబ్బంది పెడుతున్నారని, ప్రతి నెల ఎదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉండేలా చేస్తూ, ఎక్కడ లోపం జరిగినా మందలిస్తూ, మా పై ఒత్తిడి పెంచుతున్నారని కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసే వాళ్ళు. ఇలాంటి వాళ్లు, ఇప్పుడు తెలంగాణాలో జరుగుతున్న సీన్లు చూసి, చంద్రాబాబు చేస్తున్న పని కరెక్ట్ అంటున్నారు.
సమస్యలు పరిష్కరించాలని మీ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు! ఎన్నికలప్పుడే మేం గుర్తుకొచ్చామా? ఏం ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడుగుతున్నావ్? ... తెలంగాణలో పలుచోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిలదీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవున్నాయి. ‘మీరు ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. నిత్యం ప్రజల్లో ఉంటే తిరస్కారం ఉండదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు పదేపదే చెబుతున్నారు. వెరసి, తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న అనుభవాలు ఆంధ్ర ప్రదేశ్లోని ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నాయి. అంతకుముందుకంటే ఎక్కువ సమయం ప్రజల్లో ఉంటూ... సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించే దిశగా జాగ్రత్త చర్యలు మొదలు పెట్టారు. తెలంగాణలో ఎమ్మెల్యేల నిలదీత దృశ్యాలను ఏపీ ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
మరో ఆరు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. నియోజకవర్గాల్లో తాము ఇప్పటిదాకా పెద్దగా వెళ్లని నివాస ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా అని ఎమ్మెల్యేలు లెక్కలు తీస్తున్నారు. ముందుగా అక్కడకు వెళ్లి ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కింది స్ధాయి నాయకులతో మాట్లాడుతూ పెండింగ్ సమస్యలు ఎక్కడ ఎలాంటివి ఉన్నాయో ఆరా తీస్తున్నారు. సొంత పార్టీలోనే ఉన్నా వివిధ కారణాలతో దూరమైన గ్రామ, మండల స్థాయి నాయకులతో సంబంధాలు మెరుగుపర్చుకొనే ప్రయత్నం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా పూర్తిగా నియోజకవర్గ పర్యటనల్లో నిమగ్నమయ్యారు. బాగా ముఖ్యమైన పనిఉంటే తప్ప మెజారిటీ ఎమ్మెల్యేలు సచివాలయానికి కూడా రావడం లేదు. అనేక మంది మంత్రులు కూడా శాఖాపరమైన పనులు తగ్గించుకొని సొంత నియోజకవర్గాలకు, సొంత జిల్లాకు సమయం పెంచడం గమనార్హం.