రాష్ట్ర సాగునీటి చరిత్రలో నవ శకానికి ప్రభుత్వం నాంది పలుకుతోంది. పట్టిసీమ ద్వారా గోదావరి- కృష్ణా అనుసంధానంతో పవిత్ర సంగమంతో రికార్డు సృష్టించిన నేపథ్యంలో మరో అడుగు ముందుకేసి గోదావరి- పెన్నా అనుసంధానానికి శ్రీకారం చుట్టింది. నదుల అనుసంధానంతోనే కర వు నిర్మూలన సాధ్యమని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రైతాంగానికి సాగునీరందించేందుకు గోదావరి- పెన్నా అనుసంధానం కీలకం కానుంది. తొలిదశలో సాగర్ ఆయకట్టుకు సాగు నీరందించే ఈ పథకం పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 26వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం ఐదు దశల్లో గోదావరి- పెన్నా అనుసంధానం పనులు చేపడతారు. తొలిదశ లో పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా గోదావరి నుంచి ప్రస్తుతం ఉన్న పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా కృష్ణానదికి మళ్లించిన నీటిని గుంటూరు జిల్లా హరిశ్చంద్రాపురం గ్రామం వద్ద అంటే నాగార్జునసాగర్ కుడికాలువ 80వ కిలోమీటర్ వద్ద ఎత్తిపోతల ఏర్పాటు కానుంది.
ఈ మహాయజ్ఞంలో భాగంగా తొలిదశ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ అంచనా విలువ రూ. 83, 976 కోట్లు. తొలిదశ పనులు పూర్తయి తే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 16 నియోజకవర్గాల్లో 79 మం డలాల పరిధిలోని 9లక్షల 61వేల ఎకరాలకు సాగునీరు అందటంతో పాటు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. తద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీటి కొరత శాశ్వతంగా తీరనుంది. గుం టూరు జిల్లాలో గుంటూరు, ప్రత్తిపాడు, తాడికొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, వినుకొండ, చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల, ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం, కొండేపి, ఒంగో లు, దర్శి, సంతనూతలపాడు, పర్చూరు, అద్దంకి నియోజకవర్గా ల్లో రైతాంగానికి తొలిదశ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందుతుంది. పోలవరం కుడి ప్రధాన కాలువలోకి పట్టిసీమ నుంచి 8500 క్యూసెక్కులు, చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 6870 క్యూసెక్కులు కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి మళ్లించిన నీటిలో కృష్ణాడెల్టా వినియోగానికి 7వేల క్యూసెక్కులు, మిగిలిన 7వేల క్యూసెక్కులు గుంటూరు జిల్లా హరిశ్చంద్రాపురం నుంచి 5 అంచెలుగా నకరికల్లు గ్రామం వద్ద నాగార్జునసాగర్ జవహర్ కాల్వలో కలుపుతారు. ఈ ఐదు అంచెల్లో 10.25 కిలోమీటర్ల దూరం ఎత్తిపోతల పథకం పైపుల ద్వారా, 56.35 కిలోమీటర్లు గ్రావిటీ కాల్వ ద్వారా 73 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ జవహర్ కాల్వలోకి పంపుతారు.
తొలి ఎత్తిపోతల ద్వారా కృష్ణానది నుంచి ఒక కిలోమీటరు లీడింగ్ చానల్ తర్వాత ఒకటో కిలోమీటరు వద్ద హరిశ్చంద్రాపురం గ్రామ శివారులో 17 నుంచి 24 మీటర్ల వరకు 7వేల క్యూసెక్కుల నీటిని 1.1 కిలోమీటరు వద్ద గ్రావిటీ కెనాల్‌లో వదులుతారు. అక్కడి నుండి 11.5 కిలోమీటర్ల వరకు గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలిస్తారు. రెండవ ఎత్తిపోతల పథకం ద్వారా 11.5 కిలోమీటర్ల వద్ద లింగాపురం గ్రామ శివారులో లెవల్ 22.55 నుంచి 42 లెవల్ వరకు 7వేల క్యూసెక్కుల నీటిని 13.55 కిలోమీటర్ల వద్ద గ్రావిటీ కెనాల్‌లో వదులుతారు. ఇక మూడవ ఎత్తిపోతల ద్వారా 35.25 కిలోమీటర్ల వద్ద ఉయ్యందన- తాళ్లూరు గ్రామ శివారులో లెవల్ 37.64 మీటర్ల నుంచి 65 మీటర్ల వరకు 7వేల క్యూసెక్కుల నీటిని 37.75 కిలోమీటర్ల వద్ద గ్రావిటీ కెనాల్‌లో కలుపుతారు. నాలుగో ఎత్తిపోతల పథకం ద్వారా 47.25 కిలోమీటర్ల వద్ద గంగిరెడ్డిపాలెం (రాజుపాలెం) దగ్గర లెవల్ 62.53 మీటర్ల నుంచి 107.30 మీటర్ల వర కు 7వేల క్యూసెక్కుల నీటిని 51.75 కిలోమీటర్ల వద్ద గ్రావిటీ కా లువతో కలుపుతారు. ఐదో ఎత్తిపోతలలో 65.44 కిలోమీటర్ల వ ద్ద నకరికల్లు గ్రామ పరిధిలో లెవల్ 103.93 మీటర్ల నుంచి 140 మీటర్ల వరకు 7వేల క్యూసెక్కులు నాగార్జున సాగర్ జవహర్ కా లువ 80వ కి.మీ వద్ద కలపటం ద్వారా తొలిదశ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఈ తొలిదశ పథకానికి భూ సేకరణతో కలిపి రూ. 6020.15 కోట్ల వ్యయం అవుతుంది. దీంతో పాటు సాగర్ కుడికాల్వ కింద ఉన్న శివారు ప్రాంతాలకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. సాగునీటితో పాటు మంచినీటిని పుష్కలంగా అందించే వీలు కలుగుతుంది.