మోడీ-షా పరిపాలనలో దేశంలోని అన్ని వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు ఆర్బీఐ వంతు వచ్చింది. ఈ రోజు నోట్లు రద్దు అయ్యి, రెండు ఏళ్ళు అయిన సందర్భంలో, ఇది మోడీ ఖాతాలో మరో విజయం అనుకోవాలేమో. ఆర్బీఐ, ఆర్థిక శాఖకు మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఈనెల 19న జరుగనున్న ఆర్బీఐ కేంద్ర బోర్డు సమావేశమే సెంట్రల్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు చివరి సమవేశం కానుందా? ఆ రోజే ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నారా? ప్రస్తుతం తెలెత్తిన విభేదాలు మరింత ముదిరిన పక్షంలో నవంబర్ 19నే ఉర్జిత్ రాజీనామా చేయవచ్చని ఆ సంస్థ వర్గాలను ఉటింకిస్తూ ఆన్లైన్ ఫైనాన్స్ పబ్లికేషన్ 'మనీలైఫ్' బుధవారం ఓ కథనం ప్రచురించింది. ప్రభుత్వంతో వాదన చేసిచేసి.. చాలా అలసిపోయానని, అది తన ఆరోగ్యంపై చాలా తీవ్ర ప్రభావం చూపుతోందని ఉర్జిత్ తన సన్నిహితులతో పేర్కొన్నారని ఆ కథనం తెలిపింది.
రుణ నిబంధనలను సడలించడం ద్వారా ఆర్బీఐ మిగులు నిధులను వాడుకోవాలనుకుంటున్న కేంద్రం ఆలోచను ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ విభేదిస్తున్నారు. దీంతో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. గత నెలలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆచార్య వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరింది. సెంట్రల్ బ్యాంక్ స్వతంత్ర ప్రతిపత్తిని నీరుగారిస్తే మహావిపత్తు తప్పకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ వెంటనే రంగంలోకి దిగి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆర్బీబీకి తగిన సూచనలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని, తమ సమావేశాల్లో చర్చలను ఏనాడూ బహిర్గతం చేయమని, తుది నిర్ణయం తర్వాతే ఏ విషయమైనా ప్రకటిస్తామని చెప్పారు. ఇకముందు కూడా ఇలాగే కొనసాగుతుందన్నారు.
కాగా, పదేపదే ఆర్బీఐపై ఒత్తిడి తీసుకురావడం వల్ల ఉర్జిత్ రాజీనామా చేసే రిస్క్ ఉన్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని కేంద్రం పట్టుదలగా ఉన్నట్టు పేరువెల్లడించడానికి ఇష్టపడని కొందరు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ డిమాండ్లకు, నిర్మాణాత్మక చర్చలకు పదేపదే ఆర్బీఐ తిరస్కరించడం వల్ల ప్రభుత్వానికి అసహనం పెరుగుతోందని అధికారులను ఉటంకిస్తూ 'రాయిటర్స్' ఓ వార్తా కథనం ప్రచురించింది. ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ఆర్బీఐ రిజర్వ్ నుంచి నిధులిచ్చి సహకరించాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను పదేపదే ఆర్బీఐ తోసిపుచ్చుతోందని ఆ కథనం తెలిపింది. కాగా, 'ఇది సడలించండి...అది సడలించండి' అంటూ తన హయాంలోనూ ప్రభుత్వం నుంచి తనకు లెక్కలేనన్ని ఉత్తరాలు వచ్చేవంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సైతం మంగళవారంనాడు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.